బ్రెజిల్‌లో 28న మలి విడత పోలింగ్‌

బ్రెజిల్‌లో 28న మలి విడత పోలింగ్‌

 రియో డీ జెనీరో : బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో మలి విడత పోలింగ్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మితవాద అభ్యర్థి జైర్‌ బోల్సనారో, వామపక్ష అభ్యర్ధి ఫెర్నాండో హడ్డాడ్‌ల్లో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశాలు లేవు. దీంతో ఈ నెల 28న మలి విడత పోలింగ్‌ జరుగుతుందని భావిస్తున్నారు. అందుబాటులో వున్న తుది ఫలితాల ప్రకారం రెండో దశ పోలింగ్‌ జరుగుతుందని బ్రెజిల్‌ ఎలక్టోరల్‌ కోర్టు స్పష్టం చేసింది. 

తుది ఫలితాల ప్రకారం బోల్సనారోకి 46.1శాతం ఓట్లు రాగా, హడ్డాడ్‌కి కేవలం 29.1 శాతం ఓట్లు లభించాయి. స్పష్టమైన మెజారిటీకి కావాల్సిన ఓట్లు బోల్సనారోకి రాకపోవడంతో మలి విడత పోలింగ్‌ అవసరమైంది. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగాయని ఎలక్టోరల్‌ కోర్టు అధ్యక్షుడు రోసా వెబర్‌ వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షలను, వారి అభిప్రాయాన్ని గౌరవించారని రోసా వెబర్‌ తెలిపారు. 79.67శాతం ఓట్లు పోలవగా, 20.33శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన‌లేదు. మొత్తంగా పోలైన ఓట్లలో 91.22శాతం ఓట్లు చెల్లుబాటు కాగా, 2.67శాతం ఓట్లు ఖాళీగా ఇవ్వగా, 6.11శాతం ఓట్లు చెల్లలేదు. అధ్యక్షుడిగా గెలిచేందుకు 50శాతం పైగా ఓట్లు అవసరమై వుండగా బోల్సనారోకి కేవలం 46శాతం ఓట్లే పడ్డాయి.