బ్రెగ్జిట్‌ ఓటింగ్‌పై చర్చోప చర్చలు

బ్రెగ్జిట్‌ ఓటింగ్‌పై చర్చోప చర్చలు

  లండన్‌ : ఈ నెల 11న బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరగనున్న బ్రెగ్జిట్‌ ఒప్పందం భవిష్యత్‌పై చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఓటింగ్‌లో ప్రధాని థెరెస్సామే ఓటమి పాలయితే ఫలితం ఎలా ఉండ బోతుంది? ఆమె నిష్క్రమణకు ఇది దారి తీస్తుందా? మధ్యంతర ఎన్నికలు అనివార్యమా? అన్న కోణాల నుంచి విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. బ్రెగ్జిట్‌ ఒప్పందం వీగిపోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత వారం ప్రధాని థెరెస్సా మే, ఐరోపా మండలి మధ్య కుదిరిన బ్రెగ్జిట్‌ ఒప్పందంపై బ్రిటన్‌ ఎంపిలు మంగళ వారం నుండి 5 రోజుల సుదీర్ఘ చర్చ చేపట్టనున్న నేపథ్యంలో విశ్లేషకులు ఈ హెచ్చరిక చేయటం గమనార్హం. 

ఈ ఒప్పందానికి తాము వ్యతిరేకంగా ఓటు చేస్తామని దాదాపు 100 మందికి పైగా కన్జర్వేటివ్‌ ఎంపిలు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ నిష్క్రమణ ప్రక్రియకు తీవ్ర విఘాతం ఏర్పడనుందని పరిశీలకులు భావిస్తున్నారు. పార్లమెంట్‌ ఓటింగ్‌లో ప్రధాని మే ఓటమి పాలయితే తరువాత జరిగే పరిణామాలు ఇప్పటి వరకూ ఎవరికీ తెలియనప్పటికీ, రాజకీయ నేతలు, విశ్లేషకులు మాత్రం ఓటింగ్‌ అనంతర పరిస్థితులపై విస్తృత స్థాయిలో ఊహాగానాలు వెలువరిస్తున్నారు. బ్రెగ్జిట్‌ ఒప్పందానికి సవరణలుచేయటం నుండి ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఎన్నికలకు వెళ్లటం వరకూ ఈ ఊహాగానాలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ ఆఫ్‌ బకింగ్‌హామ్‌కు చెందిన ప్రొ.ఆంథోనీ గ్లీస్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డిసెంబర్‌ 11న పార్లమెంట్‌ ఓటింగ్‌లో ప్రధాని మే ఓడిపోతే రాజ్యాంగ సంక్షోభం అనివార్యమవుతుందని స్పష్టం చేశారు. 

ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీకి చెందిన నేత సర్‌ కీర్‌ స్టార్‌మర్‌ ఆదివారం ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బ్రెగ్జిట్‌ ఒప్పందంపై పార్లమెంట్‌ ఓటింగ్‌లో ప్రధాని ఓటమి పాలయితే తాము ప్రధానిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. బ్రెగ్జిట్‌పై దేశ అటార్నీ జనరల్‌ జెఫ్రీ కాక్స్‌ సలహాలను ప్రభుత్వం నిరాకరించటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వం యుద్ధ భేరీ మోగించేందుకు సిద్ధమవుతున్నాయి.