బ్రిటన్‌ స్థానిక ఎన్నికల్లో...లేబర్‌ పార్టీ విజయం

బ్రిటన్‌ స్థానిక ఎన్నికల్లో...లేబర్‌ పార్టీ విజయం

 లండన్‌ : బ్రిటన్‌ స్థానిక ఎన్నికల్లో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల మేరుకు లేబర్‌ పార్టీ అత్యధికంగా 1990 కౌన్సిలర్ల స్థానాలను గెల్చుకుంది. మొత్తం 150 కౌన్సిల్స్‌లో 4300 స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు 138 కౌన్సిళ్లలో 3,921 స్థానాల ఫలితాలను ప్రకటించారు. ప్రధాని థెరిస్సా మే నేతృత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీ కేవలం 1280 కౌన్సిలర్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇప్పటి వరకు లేబర్‌ పార్టీ గత ఎన్నికల కంటే 60 స్థానాలను అధికంగా గెల్చుకోగా, కన్జర్వేటివ్‌ పార్టీ 16 స్థానాలను కోల్పొయింది. లిబరల్‌ డెమోక్రట్స్‌ పార్టీ మొత్తం 472 స్థానాలను గెల్చుకుంది. గతం కంటే అధికంగా 57 స్థానాలను పొందింది. గ్రీన్‌ పార్టీ కూడా గతం కంటే ఐదు స్థానాలు అదనంగా పొంది మొత్తం 34 స్థానాలను కైవసం చేసుకుంది.

బ్రిగ్జెట్‌కు అనుకూల పార్టీ అయిన యుకె ఇండిపెండెన్స్‌ పార్టీ భారీగా నష్టపోయింది. ఈ పార్టీ కేవలం మూడు స్థానాలనే గెల్చుకోగలిగింది. గత ఎన్నికల్లో గెలిచిన 123 స్థానాలను కోల్పొయింది. ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీ మంచి విజయాన్ని సాధించిందని ఆ పార్టీ నేత జెరిమి కార్బిన్‌ పేర్కొన్నారు. ఓట్ల శాతం ప్రకారం చూస్తే లేబర్‌, కన్జర్వేటివ్‌ పార్టీలు రెండూ దాదాపు 35 శాతం ఓట్లను సాధించాయి. లిబరల్‌ డెమోక్రట్లు దాదాపు 16 శాతం ఓట్లను తెచ్చుకున్నారు. యుకె ఇండిపెండెన్స్‌ పార్టీకి చెందిన ఓట్‌ బ్యాంక్‌ అంతా ఈసారి కన్జర్వేటివ్‌ పార్టీకి పడడంతో ఆ మాత్రం ఫలితాలను రాబట్టుకోగలిగింది.