కెవనాకు ట్రంప్‌ క్షమాపణ

కెవనాకు ట్రంప్‌ క్షమాపణ

 వాషింగ్టన్‌ : అమెరికా సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తి జస్టిస్‌ బ్రెట్‌ కెవనాకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్షమాపణలు చెప్పారు. జడ్జీగా నియామకం చేపట్టే ముందు కొందరు చేసిన అర్థరహిత అసత్య ఆరోపణల కారణంగా తీవ్ర మానసిక క్షోభకు గురైన కావెనాకు దేశం తరఫున క్షమాపణలు చెబుతున్నట్టు ట్రంప్‌ తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ట్రంప్‌ నామినేట్‌ చేసిన బ్రెట్‌ కావెనాపై ఇటీవల ముగ్గురు మహిళలు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 1982లో జరిగిన ఓ పార్టీలో మద్యం మత్తులో ఉన్న కావెనా తనను లైంగికంగా వేధించా రంటూ ప్రొఫెసర్‌ క్రిస్టీన్‌ బ్లాసీ ఫోర్డ్‌ ఆరోపించారు. 

యేల్‌ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఓసారి కావెనా తనముందు అసభ్యకరంగా ప్రవర్తి చారంటూ ఆయన క్లాస్‌మెట్‌ డెబోరా రామిరెజ్‌ వెల్లడించారు. 1980లో కావెనా అమ్మాయిలకు పార్టీల్లో డ్రగ్స్‌ ఇచ్చి లైంగికంగా వేధించేవారని జూలీ స్వెట్నిక్‌ అనే మరో మహిళ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ కావెనా ఖండించారు. తనపై కావాలనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కావెనాకు డోనల్డ్‌ ట్రంప్‌ మద్దతుగా నిలిచారు. కావెనా మీద వచ్చిన ఆరోపణలపై ఎఫ్‌బీఐ గతవారం విచారణ జరిపింది. కానీ, ఆ వివరాలను బహిర్గతం చేయలేదు.అలా కొన్ని వారాలపాటు సాగిన చర్చలు, వివాదాల తర్వాత కావెనా నామినేషన్‌కు సెనేట్‌ ఆమోదం తెలిపింది.

కావెనాకు అనుకూలంగా 50 ఓట్లు రాగా, 48 మంది వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ట్రంప్‌ మాట్లాడారు. 'అకారణంగా తీవ్రమైన క్షోభకు గురైన బ్రెట్‌ కావెనాకు, ఆయన కుటుంబానికి దేశం తరఫున క్షమాపణలు చెప్పాలని అకున్నాను' అని అన్నారు. 'అసత్య, మోసపూరిత ఆరోపణలతో రాజకీయంగా, వ్యక్తిగతంగా అయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన అమాయకుడని తేలిన విషయం అమెరికా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.