చైనా తూర్పు తీరంలో మరియా తుపాను బీభత్సం

చైనా తూర్పు తీరంలో మరియా తుపాను బీభత్సం

  ఝీజియాంగ్‌ : చైనా తూర్పు తీరంలో మరియా తుపాను విధ్వంసాన్ని సృష్టిస్తోంది. బుధవారం ఉదయం ఫుజియన్‌ ప్రావిన్స్‌లోని లియాన్‌జియాంగ్‌ కౌంటీలో తుపాను తీరాన్ని తాకింది. ఈ ఏడాదిలో ఇది ఎనిమిదో తుపాను. తుపాను కేంద్రం వద్ద గంటకు 150కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను ధాటికి డయూ పట్టణంలోని సముద్ర ప్రాంత రోడ్డు మొత్తంగా కోసుకుపోయింది. స్థానికంగా వుండే ఇళ్ళన్నీ ధ్వంసమయ్యాయి. దాదాపు 2,70,000 మందికి పైగా ప్రజలను వారి ఇళ్ళ నుండి ఖాళీ చేయించారు. తుపాను కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా వుండి పెద్ద ఎత్తున వచ్చిన అలలు శాంషా పట్టణంలో సముద్ర ప్రాంత దుకాణాలను తుడిచిపెట్టాయి. నింగ్డా నగరంలో దాదాపు 2వేల చెట్లు కూలిపోయాయి. తుపాను ప్రభావం మరో రెండు మూడు రోజులు వుండే అవకాశం వుందని, వరదలు సంభవించే ప్రమాదముందని, కొండచరియలు విరిగిపడే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు కోరారు.