చైనాపై వాణిజ్య యుద్ధం ఉధృతం

చైనాపై వాణిజ్య యుద్ధం ఉధృతం

  వాషింగ్టన్‌ : అమెరికా చైనాపై వాణిజ్య యుద్ధాన్ని మరింత ఎగదోస్తోంది. 20వేల కోట్ల డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై సుంకాల విధింపునకు సంబంధించి తుది ప్రణాళికను రూపొందించే పనిలో అమెరికా వాణిజ్య కార్యాలయం వుండగా, అదనంగా మరో 26,700కోట్ల డాలర్ల విలువ చేసే దిగుమతులపై సుంకాలు విధిస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్‌ బెదిరించారు. శుక్రవారం నాడిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుతం 20వేల కోట్ల డాలర్ల దిగుమతులపై త్వరలోనే చర్యలు తీసుకోబోతున్నాం. వాటితో పరిస్థితి ఎలా వుండబోతోందో చూడాలి, అదికాకుండా మరో 26వేల కోట్ల దిగుమతులపై కూడా స్వల్ప నోటీసుతోనే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా వున్నామని ట్రంప్‌ చెప్పారు. ప్రస్తుతం 5వేలకోట్ల విలువ చేసే చైనా వస్తువులపై సుంకాలు అమల్లో వున్నాయి. కొత్త సుంకాలు ఏ రీతిలో విధించాలనే అంశంపై ప్రస్తుతం అధికారులు సమీక్ష జరుపుతున్నారు. 

ఒకేసారి కొత్త సుంకాలు అమలు చేయడమా లేక దశలవారీగా విధించడమా అని యోచిస్తున్నారు. పైగా ఈ చర్యలకు ఎలాంటి న్యాయపరమైన సవాళ్ళు ఎదురుకాకుండా వుండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, ఇలా చేయడం వల్ల తమకు వ్యయం పెరుగుతోందని, అంతర్జాతీయంగా సరఫరా క్రమం దెబ్బతింటుందని పలు వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత వారం నాలుగు ప్రధాన సాంకేతిక సంస్థలైన సియాస్కో, డెల్‌, హ్యూలెట్‌ పాకార్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, జూనిపర్‌ నెట్‌వర్క్స్‌లు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయానికి ఒక లేఖ రాశాయి. ఈ సుంకాల విధింపు చర్యల వల్ల వినియోగదారులపై భారం పెరిగిపోతోందని, కొంత నిరుద్యోగ సమస్యకు కూడా కారణమవుతోందని హెచ్చరించారు. 10 నుండి 25శాతం అదనపు సుంకాలు విధించినా విస్తృత స్థాయిలో ఆర్థికపరమైన నష్టాలు, అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు, కార్మికులు, వినియోగదారులు, విస్తృత ఆర్ధిక, వ్యూహాత్మక ప్రాధాన్యతలు అన్నీ ప్రమాదంలో పడతాయని ఆ లేఖ హెచ్చరించింది.