‘ఏదో ఒక చర్య తీసుకోవాలి’

‘ఏదో ఒక చర్య తీసుకోవాలి’

  వాషింగ్టన్‌ : ఉత్తర కొరియా విషయంలో 'ఏదో ఒకటి చేయాల్సిందేనని' అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. ఉత్తర కొరియా ఇటీవల జరిపిన అణు, క్షిపణి పరీక్షల నేపథ్యంలో భిన్నంగా వ్యవహరించాలని భావిస్తున్నానని చెప్పారు. ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన దశకు సమస్య చేరుకుందని అన్నారు. 'ఇతరుల కన్నా భిన్నంగా వ్యవహరించాలని, ఆలోచించాలని భావిస్తున్నా. నాకు తెలిసి ఈ అంశంపై ఇతరుల కన్నా కూడా చాలా ధృఢంగా, కఠినంగా వ్యవహరిస్తానని అనుకుంటున్నా. అయితే అందరు చెప్పేది వింటా.' అని ట్రంప్‌ విలేకర్లతో అన్నారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెయుతో కలిసి ఓవల్‌ కార్యాలయంలో బుధవారం ఆయన పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. 'అంతిమంగా, అమెరికాకు ఏది సరైనదో అదే చేస్తా. 

ప్రపంచానికి ఏది మంచిదో అదే చేస్తా. వాస్తవానికి ఇది ప్రపంచ సమస్య. కేవలం అమెరికాది మాత్రమే కాదు.'' అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తక్షణమే పరిష్కారం కనుగొనాల్సిన సమస్య ఇదని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. 'ఇది 25ఏళ్ళ క్రితమే పరిష్కరించాల్సింది. కనీసం ఐదేళ్ల క్రితమైనా ఎదుర్కొనాల్సిన సమస్య ఇదని అన్నారు. గతంలోని అధ్యక్షులే ఈ సమస్యను పరిష్కరించి వుండాల్సింది, కనీసం ఒబామా అయినా దీని గురించి పట్టించుకోవాల్సింది, ఇక ఇప్పుడు ఈ సమస్య చాలా ముదిరి పాకాన పడుతోంది. అందువల్ల ఏదో ఒకటి చేసి తీరాల్సిందే, ఇలా వుండేందుకు ఎంత మాత్రమూ అనుమతించరాదు.'' అని ట్రంప్‌ పేర్కొన్నారు.