ఇరాన్‌లో భారీ భూకంపం:396 మంది మృతి

ఇరాన్‌లో భారీ భూకంపం:396 మంది మృతి

  బాగ్దాద్‌ : ఆదివారం ఇరాన్‌, ఇరాక్‌ల్లో సంభవించిన భూకంపంలో 332 మంది మరణించారు. రిచ్‌టర్‌ స్కేలుపై భూ కంప తీవ్రత 7.3గా నమోదైంది. పర్వతప్రాంతాల్లో, భూకంప శిధిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుపోయారని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 332మంది మరణించా రని, 2500మందికి పైగా గాయపడ్డారని ఇరుదేశాల్లోని ప్రభుత్వ మీడియా తెలిపింది. మారుమూల ప్రాంతాల నుండి ఇంకా సమాచారం అందాల్సి వుందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్‌లోని పశ్చిమ ప్రాంత ప్రావిన్స్‌ల్లో కెర్మాన్‌షా ప్రావిన్స్‌ బాగా దెబ్బతింది.

ఈ ప్రావిన్స్‌లోని సర్పాల్‌ జహబ్‌ కౌంటీ లోనే 236మందికి పైగా మరణించారు. ఇది ఇరాక్‌ సరి హద్దుకు కేవలం 15కిలోమీటర్ల దూరంలో వుంది. కాగా ఇరాక్‌లో నలుగురు మరణించగా, 50మందికి పైగా గాయ పడ్డారు. బాగ్దాద్‌లో కూడా భూకంప ప్రభావం బాగా కనిపిం చింది. ఎత్తైన భవనాలు తీవ్రంగా కంపించాయి. బాగా ఊగిపోతున్నట్లు అనిపించడంలో భవనాల నుండి భయంతో బయటకు పరుగెత్తుకు వచ్చామని ప్రజలు తెలిపారు. కుర్దిస్తాన్‌ ప్రాంత రాజధాని ఎర్బిల్‌లో కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. భూకంపం తీవ్రతకు భారీగా నష్టం జరిగిం దని ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ తెలిపింది. గ్రామాల్లో ఇళ్ళు పూర్తిగా నేలమట్టమయ్యాయి.

కూలిన ఇళ్ళు, భవనాల కింద ఎవరైనా వున్నారేమోనని అధికారులు గాలిస్తున్నారు. భూ కంపం కారణంగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ డంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. ఇరాన్‌లో 14 ప్రావిన్స్‌లు భూకంపం ధాటికి దెబ్బతిన్నాయి. పలు ఇరాన్‌, ఇరాక్‌ నగరాల్లో విద్యుత్‌ తీగలు తెగిపడడంతో అంథకారం అలుముకుంది. తీవ్రమైన చలిలో కూడా వేలాదిమంది ప్రజలు వీధుల్లో మకాం వేశారు. ప్రధానమైన భూంకంప తర్వాత 50సార్లకు పైగా భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు ఇళ్ళలోకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. 70వేల మందికి పైగా తక్షణమే ఆశ్రయం కల్పించాల్సి వుందని రెడ్‌క్రీసెంట్‌ సంస్థ తెలిపింది.

రహదారులు మూసుకుపోవడంతో మారుమూల ప్రాంతా ల్లోకి వెళ్ళడానికి లేకుండా పోయిందని, దాంతో పరిస్థితి పూర్తిగా తెలియరాలేదని ఇరాన్‌ హోం మంత్రి ఫజలి తెలిపారు. అత్యవసర సేవలందించేందుకు ఇరాన్‌ సాయుధ బలగాలను రంగంలోకి దించారు. టర్కీ, ఇజ్రాయిల్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయని మీడియా వార్తలు తెలిపాయి. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించాల్సిందిగా ఇరాన్‌ మత పెద్ద అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వ సంస్థలను కోరారు. బాధిత కుటుంబాలకు సంతాపాన్ని, సానుభూతిని తెలియచేశారు.