గ్రీస్‌ విద్యార్థి ప్రదర్శనల్లో ఘర్షణలు

గ్రీస్‌ విద్యార్థి ప్రదర్శనల్లో ఘర్షణలు

 ఏథెన్స్‌: 2008లో పోలీసు కాల్పుల్లో మరణించిన ఒక విద్యార్థి స్మారకార్థం గ్రీస్‌లో విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు పోలీసులతో ఘర్షణలతో హింసాత్మకంగా మారాయి. రాజధాని ఏథెన్స్‌ నగరంలో విద్యార్థి సంఘాలు నిర్వహించిన ఈ ప్రదర్శనలకు వామపక్ష పార్టీలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక గ్రూపులు మద్దతు ప్రకటించాయి. విద్యార్థుల ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో విద్యార్థులు వారిపై రాళ్లు, పెట్రోల్‌ బాంబులు రువ్వారు. దీనిపై స్పందించిన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు, స్టన్‌ గ్రెనేడ్స్‌ వంటి వాటిని ఉపయోగించారు. 

పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థుల్లో కొందరు రోడ్డు పక్కన నిలిపి వుంచిన చెత్త రవాణా వాహనాలను దగ్ధం చేశారు. 2008 డిసెంబర్‌ ఆరవ తేదీన ఎగ్జార్షియా జిల్లాలో 15 ఏళ్ల విద్యార్థి అలెగ్జాండ్రస్‌ గ్రిగరోపౌలోస్‌ పోలీసు కాల్పుల్లో మరణించిన ప్రదేశంలో విద్యార్థి ప్రదర్శనలుఉధృత స్థాయిలో కొనసాగాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక పోలీసు అధికారికి తరువాత యవజ్జీవిత జైలుశిక్ష విధించారు. గ్రిగరోపౌలోస్‌ మృతి అనంతరం పోలీసుల హింసకు వ్యతిరేకంగా రెండు వారాలపాటు కొనసాగిన నిరసన ప్రదర్శనలతో గ్రీస్‌ మొత్తం దద్దరిల్లింది.

విద్యార్థి ప్రదర్శనలకు భద్రత కల్పించేందుకు ఏథెన్స్‌ నగర వ్యాప్తంగా దాదాపు 3 వేల మంది అధికారులను నియమించారు. ఏథెన్స్‌తో పాటు గ్రీస్‌ ఉత్తర ప్రాంతంలోని థెస్సాలోనికి నగరంలో కూడా విద్యార్థుల ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. గురువారం టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ గ్రీస్‌ పర్యటనకు వస్తుండటంతో గ్రీస్‌ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని ఏథెన్స్‌ నగరంలో నిరసన ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. నగరంలో ట్రాఫిక్‌పై కూడా ఆంక్షలు విధించారు.