హింసాత్మకంగా మారిన పాలస్తీనియన్ల నిరసన

హింసాత్మకంగా మారిన పాలస్తీనియన్ల నిరసన

 ఖుజా : ఇజ్రాయల్ సరిహద్దులో పాలస్తీనియన్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. గాజా సరిహద్దు దాటేందుకు వేలాది మంది ఒకేసారి దూసుకురావడంతో వారిని నిలువరించే క్రమంలో ఇజ్రాయల్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఏడుగురు పాలస్తీనియన్లు మరణించగా, 1,070 మందికి గాయాలయ్యాయని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేరొన్నది. మరో 25 మంది పరిస్థితి విషమంగా ఉందని, గాయపడిన వారిలో 48 మంది చిన్నారులుండగా, 12 మంది మహిళలు ఉన్నారని ఆ శాఖ తెలిపింది. శరణార్థులను తిరిగి ఇజ్రాయల్‌లోకి అనుమతించాలంటూ ఆరు వారాల పాటు నిరసన వ్యక్తం చేయాలని పాలస్తీనియన్ సున్నీ ముస్లిం సంస్థ హమాస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగాయి. 

శుక్రవారం ప్రార్థనల అనంతరం ఖుజా క్యాంప్‌నకు సమీపంలోని సరిహద్దులకు పెద్ద సంఖ్యలో నిరసనకారులు చేరుకున్నారు. ఇజ్రాయల్ సైనికులు తమను గుర్తించకుండా ఉండేందుకు టైర్లు కాల్చి దట్టమైన పొగబెట్టారు. వారి దృష్టిని మళ్లించి సరిహద్దులోని కంచె తొలగించేందుకు ప్రయత్నించడంతో ఇజ్రాయల్ సైన్యం టియర్ గ్యాస్, రబ్బర్ పెల్లెట్లు సహా వాటర్ క్యానన్లను ప్రయోగించింది. పరిస్థితి విషమించడంతో కాల్పులు జరిపింది. గత వారం రోజుల నుంచి కొనసాగతున్న ఆందోళనల్లో చనిపోయిన వారి సంఖ్య 29 కి చేరింది.