హోండూరస్‌ అధ్యక్షునిగా మళ్ళీ హెర్నాండెజ్‌

హోండూరస్‌ అధ్యక్షునిగా మళ్ళీ హెర్నాండెజ్‌

  తెగుసిగల్ప : హోండూరస్‌ అధ్యక్షులుగా జువాన్‌ ఓర్లాండో హెర్నాండెజ్‌ రెండోసారి ఎన్నికయ్యారంటూ ఆ దేశ ఎన్నికల ట్రిబ్యునల్‌ ప్రకటించింది. బ్యాలెట్‌లో రిగ్గింగ్‌ జరిగిందంటూ నిరసనలు వెల్లువెత్తినప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా ఎన్నికల సంస్థ ఈ ప్రకటన చేయడం విశేషం. దాదాపు 30 లక్షల ఓట్లు లెక్కించిన అనంతరం హెర్నాండెజ్‌కు ఆయన ప్రత్యర్థి సాల్వడార్‌ నస్రల్లా కన్నా 52 వేల ఓట్లు అంటే 1.6 శాతం ఓట్లు మెజారిటీ వచ్చినట్లు ఎన్నికల ట్రిబ్యునల్‌ చీఫ్‌ డేవిడ్‌ మటమూర్స్‌ పేర్కొన్నారు. 

రిగ్గింగ్‌, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన ప్రాంతాల్లోని ఎనిమిది బ్యాలెట్‌ పెట్టెలను ఇంకా తెరవను కూడా లేదని ట్రిబ్యునల్‌ పేర్కొంది. కాగా మాజీ అధ్యక్షుడు మాన్యుయల్‌ జెలయాకు మిత్రుడైన నస్రల్లా 8 ఏళ్ల క్రితం అమెరికా తోడ్పాటుతో జరిగిన కుట్రలో పదవీచ్యుతుడయ్యారు. ఈసారి ఎన్నికల బరిలో హెర్నాండెజ్‌తో పోటీ పడినప్పటికీ ట్రిబ్యునల్‌ చీఫ్‌ ఆదేశాలతో పునరుద్దరించబడిన ఓట్ల లెక్కింపును నస్రల్లా బహిష్కరించారు. ఎన్నికల ట్రిబ్యునల్‌ను విశ్వసించలేమని వ్యాఖ్యానించారు. మొత్తం 5,179 బ్యాలెట్‌ పెట్టెలను లెక్కించాల్సిందేనని లిబరల్‌ అభ్యర్థి లూయిస్‌ జెలయా డిమాండ్‌ చేశారు.