హువావెయి సిఎఫ్‌ఓ అప్పగింతకు సిద్ధం కండి

హువావెయి సిఎఫ్‌ఓ అప్పగింతకు సిద్ధం కండి

 వాషింగ్టన్‌ : ఇరాన్‌పై ఏకపక్షంగా అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించినందుకు వాంకోవర్‌లో దాదాపు రెండు మాసాల క్రితం అరెస్టు చేసిన చైనా టెలికం కంపెనీ హువావెయి సిఎఫ్‌ఓ మెంగ్‌ వాంగ్జూను అప్పగించే కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు అమెరికా, కెనడాకు తెలియచేసింది. బ్యాంకులను మోసగించినట్లు అభియోగాలను ఎదుర్కొంటున్న మెంగ్‌ను వాంకోవర్‌లో విమానాలు మారే సమయంలో అమెరికా అధికారుల అభ్యర్ధన మేరకు కెనడా అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై వాంకోవర్‌లోని నివాసంలోనే వున్నారు. లాంఛనంగా అప్పగింత అభ్యర్ధనకు ఈ నెల 30వరకు అమెరికా అధికారులకు సమయం వుంది. అయితే, కెనడా న్యాయశాఖ సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి మరో 30రోజులు గడువిచ్చింది. కాగా మెంగ్‌ ఈ నిర్ణయాలను అప్పీల్‌ చేసుకునే అవకాశం వుంది. అంటే మొత్తం ఈ క్రమం అమలు కావడానికి చాలా కాలం పట్టవచ్చు.