ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలపై ఇయు, త్రయం విచారం

ఇరాన్‌ మీద అమెరికా ఆంక్షలపై ఇయు, త్రయం విచారం

  బ్రసెల్స్‌: ఇరాన్‌పై అమెరికా తిరిగి ఆంక్షలు విధించడంపై యూరోపియన్‌ యూనియన్‌, దాని త్రయం (ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌) సంయుక్తంగా తమ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఇరాన్‌తో చట్టబద్ధమైన వాణిజ్యం నిర్వహించే యూరోపియన్‌ వ్యాపార సంస్థలను ఈ ఆంక్షల బారి నుంచి రక్షించుకుంటామని అవి పునరుద్ఘాటించాయి. ఇరాన్‌తో కుదుర్చుకున్న చారిత్రాత్మక ఉమ్మడి సమగ్ర కార్యాచరణప్రణాళిక (జెసిపిఓఎ)-2015 కింద ఎత్తివేసిన ఆంక్షలను తిరిగి ఈ నెల5 నుంచి అమల్లోకి తేనున్నట్లు అమెరికా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇరాన్‌ అణు ఒప్పందం వినాశకరమైనదన,అది తమకు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని ట్రంప్‌ ప్రభుత్వం పేర్కొంది. 

ఈ అణు ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక భూమిక వహించిన యూరోపియన్‌ యూనియన్‌ ట్రంప్‌ ప్రభుత్వ వైఖరితో విభేదించింది. ప్రపంచవ్యాపిత అణువ్యాప్తి నిరోధానికి, బహుళపక్ష దౌత్యానికి ఇదొక కీలక సాధనమని పేర్కొంది. యూరపు, ఈ ప్రాంతానికే కాదు, యావత్‌ ప్రపంచ భద్రతకు ఇది చాలా కీలకమని ఇయూ త్రయం శనివారం నాడిక్కడ విడుదలజేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. ఈ ప్రకటనపై ఇయు విదేశీ, భద్రతా వ్యవహారాల ప్రతినిధి ఫెడరికా మొగెరిని, అలాగే ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌ ఆర్థిక, విదేశీ మంత్రులు సంతకాలు చేశారు. ఇరాన్‌తో కుదుర్చుకున్న చారిత్రాత్మక అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగుతున్న విషయాన్ని గత మే నెలలో ట్రంప్‌ ప్రకటించినప్పటి నుంచి ఇరాన్‌పై అనేక ఆంక్షలను విధిస్తూ వస్తోంది.

నవంబరు 5 నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్న ఆంక్షలు అత్యంత కఠినమైనవి, అసాధారణమైనవి మాత్రమే కాదు, ఇరాన్‌కు చెందిన కీలకమైన ఇంధన, షిప్పింగ్‌, నౌకా నిర్మాణ, ఆర్థిక రంగాలను దెబ్బతీసేవిగానూ వుంటాయని శ్వేతసౌధం బెదిరించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న అణు ఒప్పందానికి ఇరాన్‌ పూర్తిగా కట్టుబడి వున్నట్లు ఆ సంస్థ ఓ డజనుకు పైగా నివేదికలిచ్చింది. అమెరికా ఈ ఒప్పందం నుంచి వెనక్కి మళ్లినా, ఇరాన్‌ తన హామీలకు కట్టుబడి వుంటుందనే తాము భావిస్తున్నామని ఇయూ త్రయం ఆ ప్రకటనలో తెలిపింది. ఐరాస భద్రతా మండలి తీర్మానం 2231, ఇయు చట్టాల ప్రకారం ఇరాన్‌తో చట్టబద్ధమైన వ్యాపారాన్ని తమ సంస్థలు కొనసాగిస్తాయని, వాటికి ఈ ఆంక్షల బారి నుంచి రక్షణ కల్పించేందుకు తాము సిద్ధంగా వున్నామని ఇయూ త్రయం స్పష్టం చేసింది.