ఇరాన్‌ ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యం

ఇరాన్‌ ప్రభుత్వాన్ని కూల్చటమే లక్ష్యం

  వాషింగ్టన్‌: ఇరాన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కట్టుబడి ఉన్నారని ఆయన తరపు న్యాయవాది రూడి గియులియాని పేర్కొన్నారు. అధికారం నుండి ఇరాన్‌ అధ్యక్షుడ్ని తొలగించేందుకు జరుగుతున్న ఆందోళనకు ట్రంప్‌ మద్దతు ప్రకటిస్తారని, అంతకన్నా ముందుగా ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేస్తారని రూడి తెలిపారు. ఇరాన్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కులపై వాషింగ్టన్‌లో జరిగిన సదస్సులో మాట్లాడిన రూడి పై విధమైన వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌ సిటి మాజీ మేయర్‌ అయిన రూడి అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యక్తిగత సన్నిహితుడు, దీర్ఘకాలిక మద్దతుదారు. 

యూరోపియన్‌ మిత్రుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ ట్రంప్‌ ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటారని, ఇందుకు ఆయన కేబినెట్‌ సహకరిస్తుందని రూడి పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్న అమెరికా నిర్ణయంపై ఇరాన్‌ తీవ్రంగానే స్పందిస్తోంది. అధ్యక్షుడు హస్సన్‌ రౌహాని ఆదివారం మాట్లాడుతూ అమెరికా తన నిర్ణయం పట్ల బాధపడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనలన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలని అమెరికా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అసలు విషయాన్ని మాత్రం విస్మరిస్తోంది. మేరిల్యాండ్‌లోని సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌ మరియు ఇరాన్‌ పోల్‌ నిర్వహించిన ఓటింగ్‌ ప్రకారం పౌర హక్కులు లేవని ఇరాన్‌లో కేవలం 0.3 శాతం మంది ప్రజలు మాత్రమే భావిస్తున్నారు.

అన్యాయం జరుగుతోందని కూడా కేవలం 1.4 శాతం మంది ప్రజలు మాత్రమే అనుకుంటు న్నారు. వీటికంటే నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉందని 40 శాతం మంది ప్రజలు, ధరలు, జీవన వ్యయాలు పెరిగిపోయాయంటూ 12.5 శాతం మంది ప్రజలు భావి స్తున్నారు. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉద్యో గాలు, ఉపాధి, మంచి జీవన ప్రమాణాలు కోసం డిమాండ్‌ చేస్తున్నారని ఇస్తాంబు ల్‌లోని అరుదిన్‌ యూనివర్శిటీకి చెందిన అహ్మదుల్‌ బురయి పేర్కొన్నారు.