జోర్డాన్‌ సంక్షోభంపై గల్ఫ్‌లో గుబులు

జోర్డాన్‌ సంక్షోభంపై గల్ఫ్‌లో గుబులు

 అమ్మాన్‌: అమెరికా మిత్రదేశమైన జోర్డాన్‌లో ఐఎంఎఫ్‌ పొదుపు చర్యలకు వ్యతిరేకంగా గత పక్షం రోజులుగా నిరసనలు హోరెత్తుతుండడంతో జోర్డాన్‌ రాచరిక వ్యవస్థ పునాదులు కదులుతున్నాయి. ఈ నిరసన జ్వాల ఇతర గల్ఫ్‌ దేశాలకు కూడా పాకి మరో అరబ్‌ వెల్లువకు ఎక్కడ దారి తీస్తుందోనని ఈ ప్రాంతంలోని రాచరికపు ప్రభుత్వాలు భయపడుతున్నాయి. జోర్డాన్‌లో సంక్షోభాన్ని ఏదో ఒక విధంగా సద్దుమణిగేలా చేసేందుకు గల్ఫ్‌ దేశాలు రంగంలోకి దిగాయి. గల్ఫ్‌లో అమెరికాకు అత్యంత సన్నిహితమైన సౌదీ అరేబియా జోర్డాన్‌లో ఆర్థిక సంక్షోభంపై ఆదివారం మక్కాలో ఒక సమావేశం నిర్వహించింది. సౌదీ రాజు సల్మాన్‌, జోర్డాన్‌ రాజు అబ్దుల్లా 2, కువైట్‌ అమీర్‌ షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ సబా ,అబుదాబి రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నాహ్యాన్‌ ఈ సమావేశానికి హాజరై జోర్డాన్‌లో సంక్షోభానికి కారణమైన ప్రతిపాదిత పన్ను సంస్కరణల బిల్లు గురించి చర్చించారు.

జోర్డాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు, బడ్జెట్‌లోటు భర్తీకి తక్షణమే 70 కోట్ల డాలర్ల మొత్తాన్ని సర్దుబాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. గతంలో అంగీకరించినట్లుగా గల్ఫ్‌ దేశాలు తమకు ఆర్థిక గ్రాంటును మంజూరు చేయాలని జోర్డాన్‌ రాజు కోరారు. జోర్డాన్‌లో ప్రజా నిరసన వెల్లువ 2011 నాటి అరబ్‌ ప్రజా వెల్లువ మాదిరిగా మారితే మొత్తం రాచరిక వ్యవస్థల మనుగడకే ముప్పు వస్తుందని అరబ్‌ పాలకులు భయపడుతున్నారు. జోర్డాన్‌, మొరాకోల్లో నిరసనాగ్నిని చల్లార్చేందుకు గల్ఫ్‌ సహకార మండలి (జిసిసి) తరపున వచ్చే అయిదేళ్లలో 500 కోట్ల డాలర్ల సాయం అందించాలని నిర్ణయించారు.

తాజా సంక్షోభం నుంచి తనను ఆదుకునే విషయంలో చిరకాల మిత్రదేశమైన సౌదీ అరేబియా సరిగా స్పందించడం లేదని జోర్డాన్‌ రాజు అబ్దుల్లా గుర్రుగావున్నారు.. జోర్డాన్‌లో పొదుపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు ప్రధాని రాజీనామా ఒక్కటే చాలదని, మొత్తం పొదుపు చర్యలన్నిటినీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. విపరీతంగా భారాలను మోపే పన్నుల సంస్కరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకునేంతవరకు తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు.