కెన్యా హోటల్‌పై దాడిలో 21కి పెరిగిన మృతులు

కెన్యా హోటల్‌పై దాడిలో 21కి పెరిగిన మృతులు

   నైరోబి : కెన్యా రాజధాని నైరోబిలో హోటల్‌పై జరిగిన దాడిలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. మృతుల్లో అమెరికా, బ్రిటన్‌ పౌరులు కూడా వున్నారు. జెరూసలేంను ఇజ్రాయిల్‌ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న చర్యకు ప్రతీకారంగా ఈ దాడికి పాల్పడినట్లు అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్‌ షాబాబ్‌ ప్రకటించింది. ఫైవ్‌స్టార్‌ డ్యూసిట్‌ డి2 హోటల్‌, నైరోబిలోని వాణిజ్య సముదాయంపై రాళ్ళు, గ్రెనెడ్లు విసిరింది తామేనని సోమాలికి చెందిన అల్‌ షాబాబ్‌ పేర్కొంది. దాదాపు 20గంటల పాటు హోటల్‌ను మొత్తంగా తన అధీనంలోకి తీసుకుని మారణకాండ సృష్టించారు. ఈ దాడిలో మరణించిన వారిలో అమెరికన్‌ సిఇఓ జాసన్‌ స్పిండ్లర్‌ (40) వున్నారు. న్యూయార్క్‌లో 9/11 దాడుల్లో బతికి బయటపడ్డ స్పిండ్లర్‌ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు.

కాగా వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు ఉగ్రవాదులను ఏరిపారేశాయి. కాగా బుధవారం ఉగ్ర వాదులు ఒక ప్రకటన చేస్తూ, ట్రంప్‌ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయానికి మూల్యం చెలించినట్లు చెప్పారు. కాగా, కెన్యాలోని ఇజ్రాయిల్‌ ఎంబసీ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అమాయకులపై జరిపిన మరో దాడిగా అభివర్ణించింది. రెండు దేశాలు కలిసి ఉగ్రవాదంపై పోరు సల్పుతాయని ప్రకటించింది.