కొరియా ద్వీపకల్పంపై అమెరికా బాంబర్లు చక్కర్లు

కొరియా ద్వీపకల్పంపై అమెరికా బాంబర్లు చక్కర్లు

 సియోల్‌ : అమెరికాకు చెందిన రెండు సూపర్‌సోనిక్‌ భారీ బాంబర్లు కొరియా ద్వీపకల్పంపై చక్కర్లు కొట్టాయి. జపాన్‌, దక్షిణ కొరియాతో కలిసి మొదటిసారిగా రాత్రి వేళల్లో సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. గుయామ్‌ స్థావరంలో వుండే రెండు బి-1బి లాన్సర్స్‌ మంగళవారం రాత్రి జపాన్‌ సముద్రంపై విన్యాసాలు నిర్వహించాయని పసిఫిక్‌ ఎయిర్స్‌ ఫోర్పెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. మిత్రపక్షాలతో కలిసి రాత్రి వేళ సురక్షితమైన పద్ధతిలో విన్యాసాలు నిర్వహించడం, బల ప్రదర్శన చేయడం అమెరికా, జపాన్‌, కొరియా రిపబ్లిక్‌ల సమర్ధతకు తార్కాణమని మేజర్‌ పాట్రిక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అమెరికా బాంబర్లు రెండు దక్షిణ కొరియా యుద్ధ విమానాలతో కలిసి జపాన్‌ సముద్ర సమీపంలో గగనతలం నుండి భూమికి క్షిపణులను ప్రయోగించాయని దక్షిణ కొరియా రక్షణ శాఖ అధికారులు బుధవారం తెలిపారు. ఆ నాలుగు విమానాలు కొరియా ద్వీపకల్పంపై ఎగురుతూ కాల్పుల విన్యాసాలు జరిపాయని అనంతరం రెండు బాంబర్లు స్థావరానికి తిరిగి వచ్చాయని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ (జెసిఎస్‌) తెలిపారు. ఉత్తర కొరియా నుండి ఎదురవుతున్న అణుముప్పును ఎదుర్కొనే సన్నద్ధతను పెంపొందించేందుకు ఉద్దేశించిన ఈ విన్యాసాలు సర్వసాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగమే అని జెసిఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇలా విన్యాసాలు నిర్వహించడం ద్వారా ఉత్తర కొరియాపై తీవ్ర స్థాయిలో ప్రతీకార చర్యకు మిత్రపక్షాలు సిద్ధంగా వున్నాయని తెలియచేసినట్లు ఆ ప్రకటన పేర్కొంది. అలాగే జపాన్‌ వైమానిక దళంతో కలిసి అమెరికా బాంబర్లు కూడా విన్యాసాలు నిర్వహించాయి. ఇటీవల ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అవసరమైతే సైనిక చర్యకు దిగుతామంటూ అమెరికా కూడా హెచ్చరించింది.

ఇదిలావుండగా దక్షిణ కొరియా దక్షిణ ఓడరేవు పట్టణమైన జిన్హేలో అమెరికా అణు జలంతర్గామి యుఎస్‌ఎస్‌ టస్కన్‌ మకాం వేసింది. దాదాపు 150మంది సిబ్బందితో వున్న ఈ జలాంతర్గామి కొరియా ద్వీపకల్పాన్ని వీడి ఎప్పుడు వెళుతుందనేది సరైన సమాచారం లేదు. ఉత్తర కొరియా చర్యలకు దీటుగా ఎలా ప్రతిస్పందించాలనే విషయమై ట్రంప్‌ తన జాతీయ భద్రతా బృందంతో మంగళవారం చర్చలు జరిపిన నేపథ్యంలో బాంబర్ల విన్యాసాలు చోటు చేసుకున్నాయి.