క్షిపణి ప్రయోగాలు ఆపం

క్షిపణి ప్రయోగాలు ఆపం

  టెహ్రాన్‌ : అమెరికా వ్యతిరేకిస్తున్నప్పటికీ తాము క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రయోగాలను ఆపబోమని ఇరాన్‌ ప్రకటించింది. ఇరాన్‌ సైనిక దళాల ప్రతినిధి అబుల్‌ఫజల్‌ షేకర్‌చి ఆదివారం ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాము క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలను, ప్రయోగాలను కొనసాగిస్తామని, ఇది తమ జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, దీనికి ఏ విధమైన చర్చలకూ ఎటువంటి సంబంధమూ లేదని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము ఇంకో దేశం అనుమతి పొందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.క్షిపణి సంపత్తిని అభివృద్ధి చేసుకోవటం ద్వారా తాము ఇతర దేశాల ప్రయోజనాలకు ఎటువంటి భంగమూ కలిగించబోమని ఇరాన్‌ ఈ ప్రాంత దేశాలకు హామీ ఇస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి చర్యలు కేవలం దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసి ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. ఇరాన్‌ క్షిపణి ప్రయోగాలు ఐరాస భద్రతా మండలి తీర్మానం 2231కి వ్యతిరేకమని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన షేకర్‌చీ ఈ వ్యాఖ్యలు చేశారు.