లైంగిక వేధింపుల బాధితులకు మద్దతుల వెల్లువ

లైంగిక వేధింపుల బాధితులకు మద్దతుల వెల్లువ

 లాస్‌ ఏంజెల్స్‌ : లైంగిక దాడులు, వేధింపుల బాధితులకు మద్దతుగా ఆదివారం లాస్‌ఏంజెల్స్‌లో వేలాదిమంది ప్రజలు ప్రదర్శన నిర్వహించారు. రోజువారీ జీవితంలో ఇటువంటి వేధింపులు, దూషణలు ఎదుర్కొనేవారు వాటిని బయటకు వెల్లడించాలంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో స్ఫూర్తి చెంది ఈ ప్రదర్శన జరిగింది. 'మి టూ మార్చ్‌' పేరుతో ఈ ప్రదర్శన సాగింది. ఈ వార్తలు వచ్చినప్పటి నుండి సినీ పరిశ్రమలో ఉన్నత స్థాయి వ్యక్తులు తమ జీవితంలో ఏదో ఒకసారి ఎదుర్కొన్న వేధింపుల గురించి చెబుతూనే వస్తున్నారు. ఆ ఆరోపణలపై, అసభ్య ప్రవర్తనలపై దర్యాప్తులు కొనసాగుతునే వున్నాయి. 

హాలివుడ్‌ నడిబొడ్డున డాల్బీ థియేటర్‌కు సమీపంలో ప్రదర్శన ప్రారంభమైంది. ''బాధితులందరూ ఏకం కావాలి ఇప్పటికే మనం దీర్ఘకాలం మౌనం పాటించాం. ఇక కుదరదు'' అంటూ నినదించారు. నటి ఆలైసా మిలానో ఇచ్చిన పిలుపుతో మి టూ పేరుతో సోషల్‌ మీడియాలో ఉద్యమం ప్రారంభమైంది. ఇటువంటి వేధింపులు ఎదుర్కొన్న మహిళలు 'మి టూ'ని స్టేటస్‌గా కొనసాగిస్తే ఈ సమస్య ఎంత పరిధిలో విస్తరించింది, ఎంత తీవ్రంగా వుందో అందరికీ తెలుస్తుందని ఆమె పేర్కొన్నారు. రోజుల వ్యవధిలోనే లక్షలాది మంది మహిళలు, కొంతమంది పురుషులు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తమ అనుభవాలు తెలియచేశారు. 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 47లక్షల మంది 'మి టూ'తో ఏకమయ్యారు. 12లక్షలకు పైగా పోస్టులు, వ్యాఖ్యలు, ప్రతిస్పందనలు వెలువడ్డాయి.