లూలా వారసుడు హడ్డాడ్‌

లూలా వారసుడు హడ్డాడ్‌

  బ్రసీలియా : బ్రెజిల్‌ అధ్యక్ష ఎన్నికల్లో వర్కర్స్‌ పార్టీ (పిటి) తరపున అధికార అభ్యర్థిగా ఫెర్నాండో హడ్డాడ్‌ను మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా ప్రకటించారు. ఈ మేరకు హడ్డాడ్‌కు లూలా రాసిన లేఖను ఆయన తరపు న్యాయవాది లూయిజ్‌ ఎడ్యురాడో చదివి వినిపించారు. ''మా గొంతు నొక్కాలని, దేశం కోసం మేం కంటున్న కలలను నాశనం చేయాలని వారు భావిస్తే అది అర్ధం లేనితనమే అవుతుంది. లక్షలాదిమంది ప్రజల హృదయాల్లో మేం ఇంకా సజీవంగానే వున్నాం. ఈ ఎన్నికల్లో నా తరపున హడ్డాడ్‌ పోటీచేస్తారు.'' అని లూలా ఆ లేఖలో ప్రకటించారు. లూలా ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా హడ్డాడ్‌ పనిచేశారు.

దేశ పరివర్తనా క్రమంలో ప్రధాన పాత్ర పోషించారు. హడ్డాడ్‌తో కలిసి తాను దేశ విద్యా రంగంలో సంస్కరణలు తీసుకువచ్చానని, జాతీయ విద్యా ప్రణాళికను రూపొందించామని, గతంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు రెట్లు సాంకేతిక పాఠశాలలను ప్రారంభించా మని, భవిష్యత్‌ను సృష్టించామని లూలా ఆ లేఖలో పేర్కొన్నారు. సంక్షోభం నుండి దేశాన్ని బయటపడవేసేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికకు హడ్డాద్‌ సమన్వయకర్త. అభివృద్ధి, సామాజిక న్యాయం దిశగా దేశాన్ని నడిపించేందుకు సాగే ఈ పోరులో తన ప్రతినిధిగా హడ్డాడ్‌ వ్యవహరిస్తాడని లూలా తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి మాన్యుయెలా డి అవిలా పోటీ చేస్తారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలనుకునే వారంతా హడ్డాడ్‌కు ఓటు వేసి విజయం కట్టబెట్టాలని లూలా ఆ లేఖలో ఆకాంక్షించారు.