మహిళల భద్రత పట్టించుకోండి!

మహిళల భద్రత పట్టించుకోండి!

  మెల్బోర్న్‌ : దేశంలో మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది ప్రజలు ఆదివారం భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మెల్బోర్న్‌ నగరంలో పాలస్తీనా విద్యార్థి ఒకరు అగంతకుడి తుపాకి గుండ్లకు బలైన నేపథ్యంలో దేశంలో మహిళలకు భద్రత కల్పించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఆస్ట్రేలియన్‌ మహిళలకు సంఘీభావంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాలలో మహిళలు ర్యాలీలు నిర్వహించారు. మహిళలకు హక్కులకు మద్దతుగా సిడ్నీ నగరంలో జరిగిన ర్యాలీలో దాదాపు 3 వేల మందికి పైగా మహిళలు పాల్గొన్నారు. 

ఆస్ట్రేలియన్‌ నగరాలలో వీధుల్లో సంచరించే మహిళలకు సంపూర్ణ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వీరు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాన్‌బెర్రా నగరంలో కూడా మహిళలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థ తన వార్తా కథనాలలో వెల్లడించింది. చైనాలోని షాంఘరు యూనివర్శిటీ నుండి విద్యార్థుల మార్పిడి పథకంలో భాగంగా ఆస్ట్రేలియాకు వచ్చిన పాలస్తీనా విద్యార్థిని ఆలియా మస్వారే (21) గత వారారంభంలో మెల్బోర్న్‌లో తన మిత్రులతో కలిసి వెళ్తున్న సమయంలో హత్యకు గురైన విషయం తెలిసిందే.