మాజీ గూఢచారి హత్యలో బ్రిటన్‌ కుట్ర

మాజీ గూఢచారి హత్యలో బ్రిటన్‌ కుట్ర

  మాస్కో : బ్రిటన్‌ గడ్డపై రష్యా మాజీ గూఢచారికి విష ప్రయోగం జరిగిందని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై గురువారం ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ ఘటనలో తీవ్రవాదుల ప్రమేయం లేదా మరే ప్రభుత్వ జోక్యం వుండవచ్చనని రష్యా అధికారి పేర్కొన్నారు. రష్యానే ఈ విష ప్రయోగానికి పాల్పడిందని తప్పుడు ప్రచారం జరుగుతోందని కానీ ఇందులో బ్రిటీష్‌ కుట్ర వుందనడానికి కొన్ని క్లూలు దొరికాయని అన్నారు. గూఢచారికి చెందిన ఇంట్లో మరణించిన పిల్లి, గినియా పిగ్స్‌ ఇందుకు సాక్ష్యాధారాలని చెప్పారు. గూఢచారి సెర్గి స్కిరిపాల్‌కు రెండు పిల్లులు, రెండు గినియా పిగ్స్‌ వున్నాయని వాటికి కూడా విష ప్రయోగం జరిగిందా? అవి ఎక్కడున్నాయి? వాటికి చికిత్స ఎలా అందిస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలని, వీటిపై దర్యాప్తు జరగాల్సి వుందని అన్నారు. బ్రిటీష్‌ మీడియా కూడా ఈ విషయంలో మౌనంగా వుందని అన్నారు. బ్రిటీష్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖను రష్యా అధికారికంగానే దీనిపై ప్రశ్నించిందని రష్యా ఎంబసీలోని పత్రికా విభాగ అధికారి చెప్పారు.

గూఢచారి, ఆయన కుమార్తె స్పృహ తప్పి పడిపోగానే ఆ ఇంటిని సీల్‌ చేసేశారని, అప్పుడు ఆ ఇంట్లో వున్న పెంపుడు జంతువులను అధికారులు చూడలేదా అని ప్రశ్నించారు. సరైన ఆహారం, నీర లేక అవి మరణించాయని చెబుతున్నారు, అసలు వాటి శరీరాల్లో రసాయనాలు ఏమైనా కలిశాయో లేదో పరిశీలించ కుండానే వాటికి ఎలా తుది సంస్కారాలు నిర్వహించారని ప్రశ్నించారు. వీటన్నింటినీ బ్రిటీష్‌ మీడియా కూడా కప్పిపుచ్చుతోందని విమర్శించారు. తమకు అందిన సమాచారం ప్రకారమైతే ఆ ఇంట్లో పెంపుడు జంతువులు వున్నాయని అధికారులకు తెలుసునని, కావాలనే వారు ఈ విషయంలో మౌనం వహిస్తున్నారని రష్యా అధికారి పేర్కొన్నారు. రష్యా తాజా ఆరోపణలపై బ్రిటీష్‌ ప్రభుత్వం ఇంతవరకు స్పందించ లేదు. తమ సొంతవారికి వారే విష ప్రయోగం చేసి వుండ వచ్చునని, ఆ నేరంలో రష్యాని ఇరికించాలని చూశారని, అందుకే సాక్ష్యాధారాలను కప్పిపుచ్చడానికి పిల్లిని, గినియా పిగ్స్‌ కళేబరాలను దహనం చేసేశారని పేర్కొన్నారు.