మళ్లీ నోరు జారిన ట్రంప్!

మళ్లీ నోరు జారిన ట్రంప్!

 వాషింగ్టన్‌ః అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారారు. హైతీ, ఆఫ్రికాలాంటి దేశాల వాళ్లను అసలు అమెరికాలో ఎందుకు అడుగు పెట్టనివ్వాలి అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన వాటిని షిట్‌హోల్ కంట్రీస్ అంటూ వ్యవహరించడం దుమారం రేపుతున్నది. వైట్‌హౌజ్‌లో డెమొక్రటిక్ పార్టీ సెనేటర్ డిక్ డర్బిన్, రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం కొత్తగా రూపొందించిన ఇమ్మిగ్రేషన్ విధానంపై వివరిస్తున్న సమయంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు.

ఆఫ్రికా ప్రజలందరికీ ఇక్కడ ఆశ్రయం కల్పించడం ఎందుకు? అవి షిట్‌హోల్ కంట్రీస్. నార్వేలాంటి దేశాల నుంచి ఎక్కువ మంది రావాలి అని ట్రంప్ అన్నారు. హైతీ నుంచి కూడా వలసదారుల రావడాన్ని ట్రంప్ ప్రశ్నించారు. నైపుణ్యం లేని ఇలాంటి వాళ్లను అనుమతివ్వడం కంటే.. మంచి నైపుణ్యం ఉన్న దేశాల నుంచి నిపుణులకు అనుమతివ్వడం మేలని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీ చట్ట ప్రతినిధులతోపాటు డెమొక్రటిక్ పార్టీకి చెందినవాళ్లు కూడా తీవ్రంగా మండిపడ్డారు. 


రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి మియా లవ్ దీనిపై స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చాలా దయలేనివిగా, సమాజాన్ని విభజించేవిగా ఉన్నాయని, మన దేశ విలువలకు ఇవి విరుద్ధమని అన్నారు. మియా లవ్ హైతీ నుంచి అమెరికాకు వలస వచ్చిన కుటుంబానికి చెందిన వ్యక్తి. ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి భాష వాడటం నీచమైనదని మరో రిపబ్లికన్ ప్రతినిధి ఇలియానా రోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈమె క్యూబా నుంచి అమెరికా వలస వచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు జాతి వివక్షే అవుతాయని డెమొక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతాల్ విమర్శించారు. అయితే వీళ్ల విమర్శలను వైట్‌హౌజ్ తిప్పికొట్టింది. వీళ్లంతా బయటి దేశాల వ్యక్తుల గురించి ఆలోచిస్తుంటే.. అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కేవలం అమెరికా ప్రజల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని వైట్‌హౌజ్ ప్రతినిధి రాజ్ షా అన్నారు.