మాంజిబ్‌ను వశపరచుకుంటాం : ఎర్డోగన్‌

మాంజిబ్‌ను వశపరచుకుంటాం : ఎర్డోగన్‌

 అంకారా : సిరియాలోని మాంజిబ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకోనున్నట్టు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ వెల్లడించారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో చర్చించానని అన్నారు. మాంజిబ్‌ నగరంలోని పౌరులను రక్షించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో మోహరించిన అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవడంతో ఐఎస్‌ పుంజుకుందన్నారు. కాగా, సిరియా నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్నట్టు ట్రంప్‌ గతనెల 19న పేర్కొన్న సంగతి తెలిసిందే. ఐఎస్‌పై విజయం సాధించడంతోనే 2వేల మంది అమెరికా సైనికులను వెనక్కి పిలిపిస్తున్నామని అన్నారు.

అయితే, ట్రంప్‌ చర్యల పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌ సహా కీలక రక్షణ శాఖ అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. అమెరికా పౌరులు సైతం ట్రంప్‌ చర్యలను విమర్శించారు. సిరియన్ల శ్రేయస్సు కోసం అమెరికా బలగాలు సిరియాలోనే కొనసాగాలని మెజారిటీ అమెరికా పౌరులు అభిప్రాయపడ్డారు. అయితే, సిరియాలోని ఉగ్రసంస్థల అణచివేతలో అక్కడి కుర్దు తిరుగుబాటుదారులు కొన్నేండ్లుగా అమెరికాకు సహకరిస్తున్నారు.