మరోసారి భేటీ అవుదాం....!

మరోసారి భేటీ అవుదాం....!

 వాషింగ్టన్‌ : కొరియా ద్వీపకల్పం అణు నిరాయుధీకరణపై చర్చించేందుకు మరోసారి భేటీ అవుదామంటూ ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను సాదరంగా ఆహ్వానించారు. ట్రంప్‌తో తాను మరో భేటీకి ఎదురు చూస్తున్నట్లు కిమ్‌ 'సాదరంగా, సానుకూలంగా' రాసిన లేఖ అధ్యక్షుడికి అందిందని వైట్‌ హౌస్‌ ప్రతినిధి సారా శాండర్స్‌ చెప్పారు. ఉ.కొరియా అణు కార్యక్రమాలపై ఇరుదేశాల అధినేతలు గత జూన్‌లో సింగపూర్‌లో చర్చించిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో కిమ్‌ తమ అణ్వాయుధాలను విడనాడేందుకు సిద్ధంగా వున్నారా లేదా అన్న విషయం వెల్లడించలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కిమ్‌ తాజాగా మరోసారి భేటీకి ట్రంప్‌ను ఆహ్వానించటం గమనార్హం. 

కిమ్‌-ట్రంప్‌ల మధ్య రెండో భేటీ ఎప్పుడు జరుగుతుందన్న దానిపై స్పష్టత లేదు. వచ్చే వారం ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌, ఉ.కొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌లు మూడోసారి భేటీ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో ట్రంప్‌ను కూడా కలుపుకుని త్రైపాక్షిక సమావేశంగా మార్చాలని కిమ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ త్రైపాక్షిక భేటీలోనే 1950-53 నాటి కొరియా యుద్ధానికి చరమగీతం పాడుతూ ఉమ్మడి ప్రకటన జారీ చేయించాలన్న లక్ష్యంతో కిమ్‌ ఈ దిశగా పావులు కదుపుతున్నారు.

అయితే కిమ్‌-మూన్‌-ట్రంప్‌ త్రైపాక్షిక భేటీకి అవసరమైన పరిస్థితులు ఇంకా నెలకొనలేదని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఇటువంటి త్రైపాక్షిక భేటీ విషయంలో తాము కిమ్‌ను విశ్వసించజాలమని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ అంటున్నారు. కానీ కిమ్‌ నుండి తనకు వ్యక్తిగత ఆహ్వానం అందినట్లు ట్రంప్‌ గత శుక్రవారం మీడియాకు చెప్పటంతో ఈ త్రైపాక్షిక భేటీపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉ.కొరియా ఇటీవల నిర్వహించిన 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎటువంటి క్షిపణుల బలాన్ని ప్రదర్శించకపోవటం నిరాయుధీకరణపై ఆ దేశం చూపుతున్న విశ్వాసానికి సంకేతంగా భావిస్తున్నట్లు సారాశాండర్స్‌ చెప్పారు.