నల్ల సముద్రంలోకి మరో యుద్ధ నౌక

నల్ల సముద్రంలోకి మరో యుద్ధ నౌక

 మాస్కో: రెండు వారాల వ్యవధిలో రెండు అమెరికన్‌ యుద్ధ నౌకలు నల్ల సముద్రంలో ప్రవేశించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ప్రాంతంలోని తమ మిత్రదేశాలకు సాయం అందించేందుకే తమ యుద్ధ నౌకలు అక్కడ మోహరించినట్లు అమెరికా చెబుతోంది. నల్ల సముద్రంలో పరిస్థితిని గమనించిన రష్యా తన యుద్ధ నౌకను నల్ల సముద్రంలోకి పంపాలని నిర్ణయించింది. నల్ల సముద్రంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఈ నౌకలో ఎలక్ట్రానిక్‌, ఇతర సాంకేతిక పరికరాలను అమర్చినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికన్‌ నౌకలు నల్ల సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పటికీ అక్కడ 21 రోజులకు మించి వుండటానికి వీలు లేదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తన ప్రకటనలో గుర్తు చేసింది. 

గత ఏడాది దాదాపు ఆరు అమెరికన్‌ యుద్ధ నౌకలు ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో డెస్ట్రాయర్‌ తరహా నౌకలు యుఎస్‌ఎస్‌ రోస్‌, యుఎస్‌ఎస్‌ కార్నీ, యుఎస్‌ఎస్‌ పోర్టర్‌తోపాటు కమాండ్‌ షిప్‌ యుఎస్‌ఎస మౌంట్‌ విట్నీ, డాక్‌ లాండింగ్‌ షిప్‌ యుఎస్‌ఎస్‌ ఓక్‌హిల్‌, రవాణా నౌక యుఎస్‌ఎన్‌ఎస్‌ కార్సన్‌ సిటీలు వున్నాయి. గత ఏడాది నవంబర్‌ 25న కెర్చ్‌ జలసంధిలో ఉక్రెయిన్‌ యుద్ధ నౌకలు రష్యన్‌ సముద్ర జలాల పరిధిని ఉల్లంఘించాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. .