నాటో సదస్సులో భగ్గుమన్న విభేదాలు

నాటో సదస్సులో భగ్గుమన్న విభేదాలు

 బ్రస్సెల్స్‌: మంగళవారం ఇక్కడ ప్రారంభమైన నాటో కూటమి దేశాల శిఖరాగ్ర సదస్సులో అమెరికా-ఐరోపా కూటమి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జర్మనీపై దాడితో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. గ్యాస్‌ పైపులైన్‌ కోసం జర్మనీ నేడు రష్యా చేతిలో బందీ అయిందన్నారు. నాటో నిర్వహణ వ్యయాన్ని జర్మనీ, ఇతర యూరపు దేశాలు కూడా సమానంగా భరించాల్సిందేనన్నారు. ఈ మేరకు యూరపు దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచేలా చూడాలని నాటో కూటమి సెక్రటరీ జనరల్‌ స్టాల్టెన్‌ బర్గ్‌ను ఆయన కోరారు. రష్యన్‌ గ్యాస్‌పైపులైన్‌ కోసం జర్మనీ వందల కోట్ల డాలర్లు రష్యాకు చెల్లించడం విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. 

ట్రంప్‌ వ్యాఖ్యలను జర్మనీ అధ్యక్షురాలు మెర్కెల్‌ వెంటనే తోసిపుచ్చారు. నాటో కూటమి సమావేశాలు బుధ, గురు వారాల్లో రెండు రోజులపాటు ఇక్కడ జరగనున్నాయి. ఐరోపా, కెనడా, మెక్సికో, చైనాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దుందుడుకుగా ప్రకటించిన వాణిజ్యపోరుపై జి-7 సదస్సులో ఇయు నేతలు కస్సుబుస్సులాడిన నెలరోజులకే బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో నాటో కూటమి సమావేశాలు జరుగుతున్నాయి.. రష్యా నుంచి జర్మనీ బిలియన్ల డాలర్ల ఖరీదైన ఇంధనాన్ని ఖరీదు చేస్తోందని ఆరోపించారు. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాతో పాటు కొన్ని యురోపియన్‌ దేశాలు నాటో మిలిటరీ దళాన్ని ఏర్పాటు చేశాయి. నాటోను నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌గా పిలుస్తారు. కొంతకాలంగా నాటో సంకీర్ణదళాలు అనేక యుద్ధాల్లో పాల్గొన్నాయి. అఫ్ఘనిస్థాన్‌, ఇరాక్‌ యుద్ధాల్లో ఈ దళాలు కీలక పాత్ర పోషించాయి. మొత్తం 29 దేశాలు నాటోలో సభ్యత్వం కలిగి ఉన్నాయి.

అయితే ఆ దేశాలు తమ డిఫెన్స్‌ బడ్జెట్‌లో నాటో కోసం కోటా కేటాయించడం లేదని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. నాటో దేశాలు తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. కానీ మరోవైపు నాటో దేశాలు మాత్రం ట్రంప్‌ వాదనను తోసిపుచ్చుతున్నాయి. ప్రతి ఏడాది నాటో సంకీర్ణదళాల కోసం తమ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్టు ఆ దేశాలు అంటున్నాయి. అమెరికానే ఆ అంశాన్ని విస్మరిస్తోందని నాటో దళాలు ఆరోపిస్తున్నాయి. వాషింగ్టన్‌ నుండి బయల్దేరటానికి ముందే ఇయుపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్‌ బ్రస్సెల్స్‌ నుండి బ్రిటన్‌కు తరువాత ఫిన్లండ్‌కు వెళ్తారు. అక్కడ ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అవుతారు. తన ఐరోపా పర్యటనలో ప్రధాన చర్చనీయాంశాలు నాటో సదస్సుతో పాటు బ్రిటన్‌ ప్రభుత్వంలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులేనన్న ట్రంప్‌... తనకు నాటోతో పాటు సంక్షుభిత బ్రిటన్‌, పుతిన్‌ కూడా కావాలని, వీరందరిలో పుతిన్‌తో వ్యవహరించటమే తనకు అత్యంత సులభమని అన్నారు.

రష్యా లేదా చైనాలను తప్పించి ఐరోపా మిత్ర దేశాలను తాను కలుసుకోవాలనుకోవటం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రష్యాతో పోలిస్తే చైనా కొన్ని అంశాలలో మెరుగన్న ట్రంప్‌ పుతిన్‌ను తన 'శత్రువు'గా పిలవటానికి నిరాకరించారు. అంతకన్నా ఆయన తనకు 'పోటీదారుడి'గానే భావిస్తున్నానన్నారు. ఇరుదేశాలూ ఐరోపా కూటమి ద్వారా ప్రయోజనం పొందుతున్నాయని, అయితే నాటో కూటమిపై అమెరికా చేస్తున్న వ్యయం తమకన్నా ఐరోపా కూటమికే ఎక్కువ ప్రయోజనకరంగా వుంటోందని అభిప్రాయపడ్డారు. మంగళవారం నాటో-ఇయు భేటీ ముగిసిన అనంతరం ఇయు కౌన్సిల్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌ మీడియాతో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దీర్ఘకాలంగా, దాదాపు ప్రతిరోజూ తమపై చేస్తున్న విమర్శలను తాను నిశితంగా గమనిస్తూనే వున్నానన్నారు.

తాను అమెరికా అధ్యక్షుడికి ఒకటే చెప్పదల్చుకున్నానని 'అమెరికాకు ఐరోపా కంటే మంచి మిత్ర దేశాలు ఎక్కడా లభించవ'ని టస్క్‌ అన్నారు. ప్రస్తుతం ఐరోపా దేశాలు రష్యా, చైనా కన్నా ఎక్కువ స్థాయిలోనే రక్షణకు ఖర్చు పెడుతున్నాయని, మీరు మీ మిత్రదేశాలను అభినందించాలి తప్ప విమర్శించరాద'ని టస్క్‌ స్పష్టం చేశారు. 'అమెరికా-ఐరోపా ఉమ్మడి రక్షణ, భద్రతపై తమ కూటమి సభ్యదేశాలు దృష్టి పెడుతున్నాయని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి చేసిన దాడుల్లో ఐరోపా కీలక పాత్ర పోషించిన విషయాన్ని మరువరాదని ఆయన ట్రంప్‌కు సూచించారు. 'ఎవరు వ్యూహాత్మక మిత్రులో, ఎవరు వ్యూహాత్మక సమస్యలో' ట్రంప్‌ తెలుసుకోవాల్సిన అవసరం వుందన్నారు.