నేపాల్‌లో రెండో దశ పోలింగ్‌

నేపాల్‌లో రెండో దశ పోలింగ్‌

 ఖాట్మండు : నేపాల్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా గురువారం 45జిల్లాల్లో రెండవ దశ పోలింగ్‌ ప్రారంభమైంది. కోటీ 22 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల తర్వాతైనా నేపాల్‌లో రాజకీయ సుస్థిరత నెలకొంటుందని ఆశిస్తున్నారు. 45 జిల్లాల్లోని 256 ప్రావిన్షియల్‌ అసెంబ్లీలకు, 128 ప్రతినిధుల సభ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతోంది. ప్రధాని షేర్‌ బహదూర్‌ దేబాతో సహా 4482మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని నిర్ణయించుకోనున్నారు. ప్రతినిధుల సభకు జరుగుతున్న ఎన్నికల బరిలో 1663మంది అభ్యర్థులు వుండగా, ప్రావిన్షియల్‌ అసెంబ్లీల ఎన్నికల్లో 2819మంది అభ్యర్థులు వున్నారు. నవంబరు 26న 32 జిల్లాల్లో మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. నూతన రాజ్యాంగం కింద పార్లమెంట్‌, ప్రావిన్షియల్‌ అసెంబ్లీల ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికలను ఫెడరల్‌ ప్రజాస్వామ్యం దిశగా నేపాల్‌ పరివర్తన చెందడానికి వేసే తుది అడుగుగా భావిస్తున్నారు.