నైజీరియాలో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలి 35 మంది మృతి

నైజీరియాలో గ్యాస్‌ ట్యాంకర్‌ పేలి 35 మంది మృతి

  అబూజా : నైజీరియాలోని నసరవా రాష్ట్రంలో ఒక గ్యాస్‌ ట్యాంకర్‌ పేలడంతో 35 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఉత్తర, దక్షిణ నైజీరియాలకు అనుసంధానంగాఉన్న అబుజా నగరంలోని లాఫియా-మకుర్డి రోడ్డుపై ఉన్న ఒక పెట్రోల్‌ బంక్‌ వద్ద గ్యాస్‌ ట్యాంకర్‌ పేలినట్లు రాష్ట్ర అత్యవసర విపత్తు నిర్వహణ సంస్థ (సెమా) సోమవారం తెలిపింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది ట్యాంకర్‌లోని గ్యాస్‌ను తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించిందని సెమా కార్యనిర్వాహక డైరెక్టర్‌ ఉస్మాన్‌ అహ్మద్‌ తెలిపారు. దీనిపై సెమా దర్యాప్తు చేపట్టిందని ఆయన తెలిపారు. ''ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు, 100 మందికి పైగా గాయపడ్డారు. ట్యాంక్‌ నుండి పేలుడు సంభవించడంతో ఏం జరిగిందో చూడాలని అక్కడకు వచ్చిన వారే ఎక్కువమంది మృతి చెందారు.'' అని అహ్మద్‌ మీడియాకు తెలిపారు. ఇదొక భయానక పేలుడు అని, ప్రమాదం నుండి బయటపడిన వారిని కలుసుకుని పరామర్శించినట్లు నైజీరియా సెనెట్‌ ప్రెసిడెంట్‌ బుకొలా సరాకి ట్వీట్‌చేశారు. మృతి చెందిన కుటుంబాల సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.