నిక్కీ స్థానంలో ఇవాంకా?

నిక్కీ స్థానంలో ఇవాంకా?

  వాషింగ్టన్‌ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా రాజీనామా చేసిన నిక్కీ హేలీ స్థానంలో తన కుమార్తె ఇవాంకను నియమిస్తే అద్భుతంగా పనిచేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే ఆమెను నియమిస్తే బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో అని కూడా అన్నారు. ఈ పదవిపై మూడు, నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ట్రంప్‌ తెలిపారు. 'నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్‌ అంబాసిడర్‌ అయ్యే అర్హతలు ఇవాంకాకి ఉందనుకుంటున్నా. 

అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో' అంటూ మీడియా సమావేశంలో ట్రంప్‌ తెలిపారు. అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. 'ప్రస్తుతం నేను వైట్‌ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం'టూ ఇవాంకా ట్రంప్‌ తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఎలాంటి ముందస్తు ఊహాగానాలు లేకుండా నిక్కీ హేలీ అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అలాగే ఆమె స్థానంలో ఎవరూ వస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది.