పాక్‌ ఎన్నికల ర్యాలీపై తాలిబన్‌ దాడి

పాక్‌ ఎన్నికల ర్యాలీపై తాలిబన్‌ దాడి

   ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ఎన్నికల ర్యాలీపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 21మంది మరణించారు. 65మంది గాయపడ్డారు. సీనియర్‌ రాజకీయ నేత, అవామీ నేషనల్‌ పార్టీ (ఎఎన్‌పి) అభ్యర్థి హరూన్‌ బిలార్‌ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించాల్సి వుండగా ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన బిలార్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళారు కానీ ఫలితం లేకపోయింది. బిలార్‌ తండ్రి బషీర్‌ అహ్మద్‌ బిలార్‌ కూడా అవామీ నేషనల్‌ పార్టీలో సీనియర్‌ నేత. 2012లో పార్టీ సమావేశం జరుగుతుండగా తాలిబన్లు జరిపిన దాడిలో మృతి చెందారు. 

తాజా దాడికి కూడా తామే కారణమని పాకిస్తాన్‌ తాలిబన్‌ ప్రకటించింది. ఎఎన్‌పిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ దాడి జరిపామని పార్టీ ప్రతినిధి మహ్మద్‌ ఖుర్సాన్‌ తెలిపారు. ఇటువంటి దాడులు మరిన్ని చేస్తామని, ప్రజలు ఎఎన్‌పి ర్యాలీలకు దూరంగా వుండాలని కోరారు. కాగా ప్రశాంతంగా వుండాలని బిలార్‌ కుటుంబం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఈ దాడిలో గాయపడిన బిలార్‌ కుమారుడు 16ఏళ్ళ దనియాల్‌ మాట్లాడుతూ అవసరమైతే తన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఈ నెల 25న జరగనున్న ఎన్నికల్లో జాప్యం కోసమే ఈ దాడులకు సిద్దపడ్డారని ఆయన విమర్శించారు.