పాక్‌ ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల జోరు

పాక్‌ ఎన్నికల్లో పార్టీల మేనిఫెస్టోల జోరు

 ఇస్లామాబాద్‌: మరో రెండు వారాల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున తరుణంలో పాక్‌ రాజకీయ పార్టీలన్నీ తమ ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేసేశాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలను జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) పార్టీ తమ మేనిఫెస్టోను 'నూతన పాకిస్తాన్‌కు మార్గం' పేరిట సోమవారం నాడు విడుదల చేసింది. 'పాకిస్తాన్‌ను ఇస్లామిక్‌ సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని ఇమ్రాన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని, పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. మాజీ ప్రధాని జుల్ఫికర్‌ ఆలీ భుట్టో స్థాపించిన పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ తమ మేనిఫెస్టోలో రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది. వ్యవసాయ విప్లవం, రైతు అనుకూల విధానాలే ప్రధానాంశాలుగా ఈ పార్టీ గత నెల 30నే తమ మేనిఫెస్టోను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారంలో ముందంజలో వుంది. గతంలో మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో హయాంలో అమలు చేసిన 'భూక్‌ మిటావో' కార్యక్రమాన్ని తమ పార్టీ అధికారంలోకి వస్తే తిరిగి కొనసాగిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు బిలావల్‌ భుట్టో ప్రకటించారు.