పాకిస్థాన్‌లో నిర్భయ వంటి ఘటన

పాకిస్థాన్‌లో నిర్భయ వంటి ఘటన

 లాహోర్ : పాకిస్థాన్‌లో నిర్భయ వంటి ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్నది. వరుసగా రెండో రోజు ప్రజలు పెద్దసంఖ్యలో ఆందోళనకు దిగారు. ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. రెండు కార్లకు నిప్పు పెట్టారు. ఈ నెల ఐదోతేదీన పంజాబ్ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన కసూర్ పట్టణంలో ఏడేండ్ల బాలిక జైనాబ్ అన్సారీ ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా ఒక దుండగుడు ఎత్తుకెళ్లి.. పదేపదే లైంగిక దాడి జరిపి తర్వాత హత్యచేశాడు. మంగళవారం చిన్నారి మృతదేహం ఒక చెత్తకుప్పలో లభించింది.

ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిన వ్యక్తి సీరియర్ కిల్లర్ అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడని, ఆగంతకుడికి ఇప్పటి వరకు ఎనిమిది ఇతర హత్య కేసులతో సంబంధం ఉన్నదని సీనియర్ పోలీసు అధికారి జుల్ఫీకర్ హమీద్ తెలిపారు. బాలిక తండ్రి మహ్మద్ అమీన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన కూతురు ప్రాణాలు దక్కేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మిలిటరీ ఇంటెలిజెన్స్, ఐఎస్‌ఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. చిన్నారిని తీవ్రంగా హింసించినట్లు ముఖంపైనా, శరీరంలోని ఇతర భాగాలపైనా గుర్తులు కనిపిస్తున్నాయి.

ఈ దారుణ హత్యపై యావత్ పాకిస్థాన్ భగ్గుమన్నది. ఆందోళనకారులు రోడ్లపై బైఠాయించడంతో మెట్రో బస్సు సర్వీసులు నిలిపేశారు. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన పాక్ సుప్రీంకోర్టు.. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని పాక్ సైనికాధిపతి, ఐఎస్‌ఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్‌ను ఆదేశించింది. కాగా నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.కోటి నగదు బహుమతి ఇస్తామని పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.

కిరణ్ నాజ్ అనే టీవీ యాంకర్ తన కూతురుతో కలిసి టీవీ వార్తా ప్రసారాల కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ రోజు నేను మీ యాంకర్‌ను కాదు. తల్లిగా నా కూతురుతో కలిసి కూర్చున్నా అని భావోద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అసమర్థతే ఈ ఘటనకు కారణమని, ఈ హత్య మానవత్వంపైనే దాడి అని అన్నారు. కాగా, ఈ నెల నాలుగో తేదీన కిడ్నాప్ కావడానికి ముందు బాలిక రాసిన కవితను జియో టీవీ చానెల్ ప్రసారం చేసింది.