పన్నుల సంస్కరణలు వద్దు

పన్నుల సంస్కరణలు వద్దు

 శాన్‌జోస్‌ : పన్ను సంస్కరణలను నిరసిస్తూ కోస్టారికా కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. పన్ను సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా గల కార్మిక సంఘాలన్నీ ఐక్య కార్యాచరణకు సిద్ధమయ్యాయి. పన్ను సంస్కరణలను తక్షణమే విడనాడాలని దాదాపు 80శాతం స్కూళ్ళు, 23 కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. విద్యార్ధులు, టీచర్లు, టెలికమ్యూనికేషన్స్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ సిబ్బంది, రవాణా కార్మికులు, వైద్య ఉద్యోగులు ఇంకా పలు విభాగాలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె విజయవంతంగా జరిగేందుకు తమ వంతు సహకారంగా వైద్య సేవలను కూడా నిలిపివేస్తామని వారు హామీ ఇచ్చారు. కాగా ఈ సమ్మె ఏ మాత్రం సరైంది కాదని, చట్ట విరుద్ధమైనదని అధ్యక్షుడు కార్లోస్‌ అల్వరాడో వ్యాఖ్యానించారు. లక్షలాదిమంది ప్రజలకు అందాల్సిన సేవలను ఇలా నిలుపుచేయడం ఎంత మాత్రమూ సరైన పరిష్కారం కాదన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో పడకుండా నివారించగలిగేది పన్నుల సంస్కరణలు మాత్రమేనని అధ్యక్షుడు స్పష్టం చేశారు. మధ్య దిగువ తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని తీసుకువస్తున్న కొత్త పన్ను సంస్కరణలు సక్రమమైనవి కావని కోస్టారికా ప్రభుత్వం ప్రకటించింది.