పేదరికాన్ని పెంచుతున్న ట్రంప్‌

పేదరికాన్ని పెంచుతున్న ట్రంప్‌

  వాషింగ్టన్‌ : అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అమెరికా మళ్లీ పేదరికం వైపు మళ్ళుతోందా? అంటే అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికాకు దీర్ఘకాల మిత్రులైనప్పటికీ ఆయా దేశాలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులపై అమెరికా అధికంగా దిగుమతి సుంకాలు విధించకుండా మినహాయించే పరిస్థితి ఎంతో కాలం వుండదని భావిస్తున్నారు. అసలు ట్రంప్‌ అనుసరించే విధానం వెనుక గల లాజిక్‌ ఏమిటనేది అర్ధం కావడం లేదు. అమెరికాకు అతి ముఖ్యమైన మిత్రదేశాలపై కూడా సుంకాలను విధిస్తామంటూ ఇటీవల ట్రంప్‌ చేసిన హెచ్చరికలు ఆర్థికవేత్తలను తికమకపెడుతున్నాయి.

అమెరికా ప్రస్తుత వాణిజ్య లోటు 566 బిలియన్ల డాలర్లుగా వుంది. ఇది ట్రంప్‌కు చాలా ఆందోళన కలిగించే అంశం. అందులో సందేహం లేదు. విదేశీ వస్తువులను దిగుమతి చేసుకోవ డానికి దేశం నుండి బయటకు వెళుతున్న నగదు మొత్తాన్ని చూస్తుంటే ట్రంప్‌ ఆందోళన మరింత పెరుగుతోంది. అమెరికాకు రావాల్సిన దాన్ని విదేశీ భాగస్వాములు తన్నుకుపోతున్నారని, తమ కార్మికులకు రావాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని, తమ ఆర్థికావకాశాలను దెబ్బతీస్తున్నారని ట్రంప్‌ విశ్వసిస్తున్నారు. తమ వాణిజ్య లోటు దీనికి సంకేతంగా భావిస్తున్నారు. ఇలా ఇతరులను నిందించడానికి బదులుగా ఈ పరిస్థితికి కారణమేంటో అమెరికా ఆత్మపరిశీలన చేసుకో వాల్సి వుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

ఒక దేశం తాను ఉత్పత్తి చేసే వాటికన్నా ఎక్కవ కొనుగోలు చేయాల్సి వస్తుందంటే, డిమాండ్‌ను సంతృప్తిపరిచేందుకు దిగుమతి చేసుకోవాల్సి వుంటుందనేది చాలా సులభంగా అర్ధం చేసుకునే అంశం. ఉదాహరణకు హేతుబద్ధమైన నాణ్యత తో అమెరికా కన్నా చవకగా బంగ్లాదేశ్‌ దుస్తులను ఉత్పత్తి చేస్తోంది. అలాగే దక్షిణ కొరియా టివిలు, చైనా మొబైల్స్‌ తయారు చేస్తున్నాయి. జర్మనీ విలాసవంతమైన కార్లను, అమెరికా బ్రాండ్ల కన్నా అధికమైన నాణ్యతతో తయారు చేస్తోంది. ఫలితంగా అమెరికా వీటిని దేశీయంగా తయారు చేయడానికి బదులుగా ఈ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేస్తోంది.

స్వదేశంలో దుస్తులను, టివిలను, ఫోన్లను తయారుచేయడం కోసం ద్రవ్యోల్బణాన్ని పెంచాలని అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నారా? వీటికి అనుబంధ పరిశ్రమలు రావడానికి భౌగోళికంగా సరైన అవకాశాలు లేని చోట, ఫ్యాక్టరీల నిర్మాణం, సిబ్బందికి శిక్షణ, సప్లై చెయిన్స్‌ ఏర్పాటు ఇవన్నీ కూడా వ్యయభరితంగా పరిణమిస్తాయి. 'మేడ్‌ ఇన్‌ అమెరికా' ను విస్తరించడం వల్ల సగటు అమెరికన్‌ కొనుగోలు శక్తి పడిపోతోంది. పైగా, గత 50ఏళ్ళలో ఎన్నడూ లేని రీతిలో నిరుద్యోగం రేటు నెలకొన్న సమయంలో దేశ తయారీ రంగంలో మరిన్ని ఉద్యోగాలు సృష్టించడానికి బదులుగా దానికి పూర్తి విరుద్ధమైన రీతిలో ట్రంప్‌ ప్రణాళిక వుంటోంది.