పిల్లల ఇంటర్నెట్‌ వినియోగంపై పరిమితి

పిల్లల ఇంటర్నెట్‌ వినియోగంపై పరిమితి

  లండన్‌: ఇంటర్నెట్‌పై పిల్లలు గడిపే సమయంపై చట్టపరమైన పరిమితి విధించాలని ప్రభుత్వం భావిస్తోందని బ్రిటన్‌ సాంస్కృతిక శాఖ తెలిపింది. పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు పిల్లలు వారంలో 20 గంటల పాటు ఇంటర్నెట్‌పై గడుపుతున్నారని బ్రిటీష్‌ చిల్డ్రన్‌ కమిషనర్‌ అన్నే లాంగ్‌ఫీల్డ్‌ నివేదిక ఇచ్చారు. ఇంటర్నెట్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించిన బ్రిటీష్‌ ప్రభుత్వం గడిపే సమయంపై పరిమితి విధించాలని భావిస్తోంది. 13 ఏళ్ల వయస్సు పై బడిన వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలని సోషల్‌ మీడియా సైట్లపై నియంత్రణ పెట్టాలని, పోర్నోగ్రాఫిక్‌ సైట్లకైతే 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే, అదీ క్రెడిట్‌ కార్డు ద్వారా మాత్రమే ఆవకాశమివ్వాలనే నియంత్రణలు పెట్టాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి.

బ్రిటన్‌ ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో మూడో వంతు 18 ఏళ్ల వయస్సులోపు వారేనని లాంగ్‌ ఫీల్డ్‌ నివేదిక చెబుతోంది. మరో నివేదిక 10 నుండి 12 ఏళ్లలోపు పిల్లల్లో 75 శాతం మంది సోషల్‌ మీడియా అకౌంట్లు కల్గి ఉన్నారని వెల్లడిస్తోంది. సోషల్‌ మీడియా అధికంగా ఉపయోగించడం పిల్లలకు స్మోకింగ్‌, ఊబకాయం కన్నా ప్రమాదకరమని బ్రిటీష్‌ ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి జెర్మీ హంట్‌ హెచ్చరించారు. పిల్లలకు వారి వయస్సుకు తగిన సమాచారం మాత్రమే ఇంటర్నెట్‌లో వారికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.