ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి ఆకస్మిక రాజీనామా

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి ఆకస్మిక రాజీనామా

 న్యూయార్క్‌: ప్రపంచ బ్యాంకు గ్రూపు అధ్యక్షుడు జిమ్‌యోంగ్‌ కిమ్‌ అనూహ్యమైన రీతిలో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ విరమణకు ఇంకా మూడేండ్ల సమయం ఉంది. పదవీ కాలం పూర్తికాకముందే ఆయన వైదొలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫిబ్రవరి1 నుంచి అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. మౌలిక రంగంలోని సంస్థలో అవకాశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రపంచ సంస్థకు అధ్యక్షుడిగా ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, పేదరికం నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినట్టు జిమ్‌ యాంగ్‌ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం పెరుగుతున్న దశలో ప్రపంచ బ్యాంక్‌ సేవలు ఎంతో అవసరమని ఆయన అన్నారు.

జిమ్‌ ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడిగా 2012లో తొలిసారి బాధ్యతలు స్వీరించారు. 2017లో రెండోసారి ఎన్నికైన జిమ్‌ పదవీ కాలం 2022తో ముగియనుంది. 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం, వర్ధమాన దేశాల్లోని వ్యక్తుల ఆదాయాన్ని పెంచడం అనే రెండు లక్ష్యాలను బ్యాంకుకు ఆయన నిర్దేశించారు. ప్రపంచ బ్యాంకు ప్రస్తుత సీఈవో క్రిస్టాలినా జార్జియేవా ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా వచ్చే నెల ఒకటో తేదీ నుంచి బాధ్యతలను స్వీకరించనున్నట్టు సమాచారం. వాతావరణ మార్పులపై పోరాడేందుకు ప్రపంచబ్యాంకు వచ్చే అయిదేళ్లలో రెట్టింపు స్థాయిలో అంటే 2వేల కోట్ల డాలర్లు పెట్టుబడిగా పెడుతుందని కొద్ది మాసాల క్రితమే ఆయన ప్రకటించారు. వాతావరణ మార్పులు, అంటు వ్యాధులు, కరువు, శరణార్ధుల వంటి అనేక సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రపంచ బ్యాంకు కృషి చేయాల్సి వుందని ఆయన పేర్కొన్నారు.