>

ప్రశాంతంగా ఫ్రెంచ్‌ పార్లమెంట్‌ మలిదశ పోలింగ్‌

ప్రశాంతంగా ఫ్రెంచ్‌ పార్లమెంట్‌ మలిదశ పోలింగ్‌

 పారిస్‌ : ఫ్రెంచ్‌ పార్లమెంట్‌ ఎన్నికల మలిదశ పోలింగ్‌ ఆదివారం నాడు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 577 మంది సభ్యులున్న ఫ్రెంచ్‌ పార్లమెంట్‌ ఎన్నికల తొలిదశ పోలింగ్‌లో అధ్యక్షుడు మాక్రాన్‌ నేతృత్వంలోని రిపబ్లిక్‌ ఆన్‌ మూవ్‌ (ఆర్‌ఇఎం) పార్టీకి ఆధిక్యత లభించవచ్చన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల మధ్య రెండో దశ పోలింగ్‌ జరగటం విశేషం. మొత్తమ్మీద మాక్రాన్‌ నేతృత్వంలోని ఆర్‌ఇఎం పార్టీకి 400-470 సీట్లు లభించవచ్చని తాజా ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేస్తున్నాయి. కొత్తతరం శాసనకర్తలతో కొత్త పార్లమెంట్‌ ఆవిష్కృతం కానుంది.

కొత్తగా పార్లమెంట్‌లో అడుగు పెట్టే వారిలో అధికశాతం మంది యువత, మహిళలే కావటం విశేషం. అంతేకాక విభిన్న జాతుల వారికి కూడా కొత్త పార్లమెంట్‌ ప్రాతినిధ్యం కల్పించనుంది. అధ్యక్షుడు మాక్రాన్‌ నేతృత్వంలోని ఆర్‌ఇఎం పార్టీ పూర్తి ఆధిక్యత కనబర్చ నున్నదన్న వార్తల నేపథ్యంలో ఫ్రెంచ్‌ పార్లమెంటరీ వ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పు 1958లో ప్రారంభమైన ప్రస్తుత అధ్యక్ష పాలనా వ్యవస్థను పూర్తి స్థాయి ప్రక్షాళన చేయనున్న దని పరిశీలకులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం వరకూ ఎవరికీ పరిచయం లేని మాక్రాన్‌కు తొలుత అధ్యక్షుడిగా అవకాశం లభించిందని పరిశీలకులు భావించినప్పటికీ ఆయన, ఆయన నేతృత్వంలోని 15 నెలల ఆర్‌ఇఎం పార్టీ ప్రజలు కోరుకుంటున్న మార్పును ప్రతిబింబిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల ప్రక్రియ, ప్రచారం అంతా తనకు సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలా వుందని ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త, ఆర్‌ఇఎం తరపున ఎన్నికల బరిలో నిలిచిన బీట్రిస్‌ ఫెయిలిస్‌ అంటున్నారు. తొలిదశ ఓటింగ్‌లో మాక్రాన్‌ ఆర్‌ఇఎం పార్టీ ఆధిక్యత కనబర్చనున్నదన్న అంచనాల నేపథ్యంలో మలిదశ ఓటింగ్‌ నిర్ణయాత్మకంగా మారింది. తొలిదశ అంచనాలే మలిదశ ఫలితాలలో పునరావృతమైతే అది ఫ్రాన్స్‌ సంప్రదాయక పార్టీలకు తీవ్ర నిరాశనే మిగులుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష గుర్తింపును దక్కించుకునే స్థాయిలో ఏ పార్టీకీ స్థానాలు లభించే అవకాశం లేదని లీ పారిజీన్‌ పత్రిక తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది. రెండు విడతలుగా జరిగిన ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో నమోదయిన పోలింగ్‌ గత 60ఏళ్లలో అత్యంత తక్కువ స్థాయి కావటమే ఇందుకు కారణమని, మాక్రాన్‌ అందరూ ఊహించినంత బలవంతుడేమీ కాదని ఈ పత్రిక వ్యాఖ్యానించింది.


Loading...