రోహింగ్యా గ్రామాల నేలమట్టంపై అమ్నెస్టీ నివేదిక

రోహింగ్యా గ్రామాల నేలమట్టంపై అమ్నెస్టీ నివేదిక

  యాంగాన్‌ : ఇటీవల రాఖినె రాష్ట్రంలో హింసాకాండ చెలరేగి లక్షలాదిమంది రోహింగ్యాలు పొరుగు దేశాలకు పారిపోయిన నేపథ్యంలో వారు నివసించిన గ్రామాలన్నింటినీ నేలమట్టం చేసిన మయన్మార్‌ ప్రభుత్వం ఆ స్థానంలో సైనిక నిర్మాణాలను, హెలిపాడ్‌లను, రోడ్లను నిర్మిస్తోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తెలిపింది. దీంతో రోహింగ్యా శరణార్థులు తిరిగి స్వదేశానికి వచ్చే అవకాశాలపై సందేహాలు నెలకొన్నాయి. దాదాపు ఏడు లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోయారు. దీంతో అక్కడ జాతి ప్రక్షాళన జరుగుతోందంటూ ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యానించింది. ఆ వ్యాఖ్యలను మయన్మార్‌ ప్రభుత్వం తిరస్కరిస్తోంది.

'రాఖినె రాష్ట్రం పునర్నిర్మాణం' పేరుతో అమ్నెస్టీ ఒక నివేదికను వెలువరించింది. ఈ ఏడాది ప్రారంభం నుండి ఆ ప్రాంతంలో సైనిక కట్టడాలు, ఇతర నిర్మాణాలు పెరుగుతున్నాయని, ఇదంతా భూ ఆక్రమణగా పరిశోధకులు పేర్కొంటున్నారు. సోమవారం ఈ నివేదికను విడుదల చేశారు. రోహింగ్యాలు తిరిగి వచ్చి నివసించాల్సిన ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాలపై కొత్త సాక్ష్యాధారాలను పొందుపరిచినట్లు అమ్నెస్టీ క్రైసిస్‌ రెస్పాన్స్‌ డైరెక్టర్‌ తిరానా హసన్‌ తెలిపారు. గత ఆగస్టులో దాడులు జరిగిన రెండు మాసాలకు ఉపగ్రహ చిత్రాలు తీశారు. తిరిగి మార్చిలో తీసిన చిత్రాల్లో భవనాల నిర్మాణాలు కనిపిస్తున్నాయి. కాన్‌ క్యా, ఇన్‌ డిన్‌ గ్రామాల్లో కూడా ఇటువంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయని ఆ నివేదిక పేర్కొంది.