రోహింగ్యాలకు సాయం అందించండి

రోహింగ్యాలకు సాయం అందించండి

 న్యూయార్క్‌ : మయన్మార్‌లో తీవ్ర హింసాత్మ పరిస్థితులను ఎదుర్కొంటున్న రోహింగ్యా ముస్లింలకు సాయపడాల్సిందిగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. రాఖినె రాష్ట్రంలో వేలాదిమంది రోహింగ్యాలపై జరుగుతున్న దాడులు, హింస, కాల్పులు వంటి ఘటనలతోపాటు లక్షలాదిమంది నిర్వాసితులు కావడంపై కూడా ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యర్తం చేసింది. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ప్రస్తుతం కొనసాగుతున్న మానవతా సాయానికి చేయూతనివ్వాల్సిందిగా ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ''రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడుల పట్ల మా ఆందోళనను స్పష్టం చేశాం. ప్రజలు ఇళ్ళు వదిలేలా ఒత్తిళ్ళు తెస్తున్నారు.

దీనికి సంబంధించిన వార్తలు గానీ, మనం చూస్తున్న చిత్రాలు కానీ హృదయవిదారకంగా వున్నాయి.'' అని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుటెరస్‌ ప్రతినిధి స్టీఫ్‌ె డుజారిక్‌ ఐరాస ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో పేర్కొన్నారు. సరిహద్దులు దాటి వచ్చిన వారు చాలా ఆపదలో వున్నారని, వారికి తక్షణ సాయం అందించడం మనందరి బాధ్యత అని అన్నారు. రోహింగ్యాలకు సాయమందించడంలో ప్రాంతీయ శక్తుల పాత్రపై అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. భారత్‌తో సహా ప్రధాన ప్రాంతీయ శక్తులేవీ కూడా ఈ సంక్షోభ పరిష్కారానికి సరిగా స్పందించలేదని మీరు భావిస్తున్నారా? వారి మద్దతు లేక తోడ్పాటు కీలకమైన తరుణంలో వారు ముందుకు రాకపోవడంపై నిరాశ చెందారా అని ప్రశ్నించగా ఆయన పై సమాధానమిచ్చారు.

మూడు లక్షల మంది శరణార్థులకు అవసరమైన సాయమందించడానికి ఐక్యరాజ్య సమితి మానవతా విభాగం వద్ద ప్రణాళిక వుందని, అయితే, ఇది సరిపోదని, మరిన్ని నిధులు అందాలని కోరారు. కొత్తగా వస్తున్న శరణార్థుల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేయాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తమని కోరిందని చెప్పారు.. శిబిరాల ఏర్పాటుకు అవసరమైన సామాగ్రి, పడుకునేందుకు చాపలు, ఇతర సరఫరాలతో కూడిన విమానం బంగ్లాదేశ్‌కు చేరుకుందని చెప్పారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ అందచేసిన సాయంతో రెండో విమానం కూడా చేరుకుందని తెలిపారు. ఈ రెండు విమానాల్లోని సరఫరాలు 25వేల మంది శరణార్థులకు సరిపోతాయని,. మిగిలిన లక్షా 20వేల మందికి సరిపడా సరఫరాలతో త్వరలోనే మరిన్ని విమానాలు బయలుదేరతాయని చెప్పారు.