రన్‌వేపై కూలిన విమానం 50 మంది మృతి

రన్‌వేపై కూలిన విమానం 50 మంది మృతి

 కాఠ్మండు: నేపాల్ రాజధాని కాఠ్మండులో విమానం కూలి 50 మంది మరణించారు. బంగ్లాదేశ్‌కు చెందిన యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానం సోమవారం కాఠ్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా రన్‌వేపై కుప్పకూలి పక్కనే ఉన్న ఫుట్‌బాల్ మైదానంలో పడింది. ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 50 మంది మరణించినట్టు ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి ప్రేమ్‌నాథ్ ఠాకూర్ తెలిపారు. 43 మంది అక్కడికక్కడే మృతిచెందారని, ఏడుగురు కాఠ్మండు వైద్యవిద్య కళాశాలలో చికిత్స పొందుతూ మృతిచెందారని చెప్పారు. చికిత్స కొనసాగుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నదన్నారు. 

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరిన ఈ విమానం కాఠ్మండులో మధ్యాహ్నం 2.20 గంటలకు దిగాల్సి ఉన్నది. రన్‌వేపై దిగుతున్న సమయంలో అదుపుతప్పి కుప్పకూలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని, విమానం మొత్తం నల్లని పొగతో నిండిపోయిందని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గౌతమ్ పేర్కొన్నారు. నేపాల్ ఆర్మీ, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను ఇప్పుడే చెప్పలేమని, అయితే ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కుప్పకూలి ఉంటుందని అనుమానిస్తున్నామన్నారు.