సైనిక పాలన దిశగా కెటలోనియా

సైనిక పాలన దిశగా కెటలోనియా

 బార్సిలోనా : కెటలోనియాలో సైనిక పాలన విధించే దిశగా స్పెయిన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అక్టోబరు 1వ తేదీ నాటి రిఫరెండం ఫలితాలను సమర్ధిస్తూ కెటలోనియా ప్రధాని కార్లెస్‌ పుడిమెంట్‌ ప్రసంగించిన నేపథ్యంలో బుధవారం స్పెయిన్‌ పార్లమెంట్‌లో ప్రధాని మారియానో రజోరు ప్రసంగించారు. స్పెయిన్‌ రాజ్యాంగంలోని 155వ అధికరణను ప్రయోగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ అధికరణలోని నిబంధనలను అమలు చేయడం ద్వారా కెటలన్‌ ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలను సస్పెండ్‌ చేయడానికి, ఆ ప్రాంత ఆస్తులు, అధికారాలను స్వాధీనం చేసుకోవచ్చు. కాగా, కెటలన్‌ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించడానికి 116వ అధికరణను ఉపయోగించడంపై స్పెయిన్‌ మీడియా చర్చిస్తోంది. 

అయితే రజోరు మాత్రం కేవలం కెటలోనియాలోనే కాకుండా మొత్తంగా స్పెయిన్‌లో సైనిక పాలన విధించే దిశగా పావులు కదుపుతున్నారు. కెటలోనియాలోకి ప్రవేశించి, అక్కడగల దాదాపు 17వేల మంది ప్రాంతీయ పోలీసు బలగాల నుండి ఎదురయ్యే వ్యతిరేకతను అణచివేయడానికి సిద్ధమవుతున్నట్లు సైనిక వర్గాలు బుధవారం తెలిపాయి. కెటలోనియాలో ఇప్పటికే రెండు యూనిట్ల సైనిక బలగాలు వున్నాయి. స్పానిష్‌ సోషలిస్టు పార్టీ (పిఎస్‌ఓఇ) పూర్తి మద్దతుతోనే రజోరు ముందుకు సాగుతున్నారు. సైనిక పాలన దిశగా తీసుకునే చర్యలను తాము వ్యతిరేకించబోమని పొడెమస్‌ పార్టీ నుండి కూడా స్పష్టంగా సంకేతాలు అందుతున్నాయి. 

స్వాతంత్య్రం ప్రకటించుకోవాలనే ఆలోచనలు, ప్రయత్నాలు విరమించుకోవడానికి కెటలన్‌ ప్రాంతీయ ప్రభుత్వానికి రజోరు ఎనిమిది రోజులు గడువిచ్చారు. అలా విరమించుకోని పక్షంలో కెటలోనియా రాజకీయ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామని, ఆ ప్రాంతాన్ని కూడా ప్రత్యక్షంగా తమ పాలనలోకి తెచ్చుకుంటామని ప్రకటించారు. దీంతో, రజోరుతో చర్చలు జరిపేందుకు వీలుగా స్వాతంత్య్ర ప్రకటనను నిలుపుచేసినట్లు పుడిమెంట్‌ తెలిపారు. అక్టోబరు 16వ తేది ఉదయం 8గంటల వరకు కెటలన్‌ ప్రభుత్వానికి గడువు వుంటుందని రజోరు తెలిపారు. అప్పటికి కూడా స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలని పుడిమెంట్‌ భావిస్తే దాన్ని నిర్ధారించేందుకు మరో మూడు రోజులు అంటే 19వ తేదీ వరకు గడువిస్తామని, ఆ తర్వాత 155వ అధికరణ అమలు చేస్తామని హెచ్చరించారు.