సంస్కరణలు కొనసాగిస్తా....

సంస్కరణలు కొనసాగిస్తా....

 పారిస్‌ : సంస్కరణలకు కట్టుబడి వుంటానని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ కార్పొరేట్‌ ఎగ్జిగ్యూటివ్‌లకు హామీ ఇచ్చారు. దేశంలో సంస్కరణలు అమలు చేయడానికి తిరస్కరించడం వల్లనే రాజు లూయిస్‌-16 గద్దె దిగాల్సి వచ్చిందని అన్నారు. దాదాపు పది వారాలుగా కొనసాగుతున్న ఎల్లో వెస్ట్‌ ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో పెట్టుబడిదారుల భయాందోళనలను పోగొట్టడంలో భాగంగా కార్పొరేట్లతో ఆయన సమావేశమయ్యారు. ఉబర్‌ సిఇఓ దారా ఖొస్రోషాహి, జెపి మోర్గాన్‌ సిఇఓ జేమ్స్‌ డైమన్‌, కోకాకోలా సిఇఓ జేమ్స్‌ క్విన్సేలతో సహా దాదాపు 150 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. పారిస్‌ వెలుపల గల ఫ్రాన్స్‌ అధ్యక్షుడి భవనంలో ఈ సమావేశం జరిగింది. 226ఏళ్ళక్రితం ఇదే రోజు అంటే జనవరి 21న ఫ్రాన్స్‌ రాజు లూయిస్‌ను ఉరితీశారు. 

అందువల్ల ఆ రోజున సమావేశం జరగడం సరికాదని చాలా మంది భావించారని అన్నారు. అయితే, ఒక్కసారిగా దేశ చరిత్రను పరిశీలించినట్లైతే, సంస్కరణలు తీసుకురావడానికి ఇష్టపడని వారంతా అర్ధంతరంగా వారి పదవులకు స్వస్తి పలకాల్సి వచ్చిందని అధ్యక్షుడు చెప్పారు. ఎల్లో వెస్ట్‌ ఉద్యమం పట్ల నెలకొన్న భయాందోళనలను తొలగించేందుకే మాక్రాన్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు బావిస్తున్నారు. కాగా, కొన్నిసార్లు హింసాత్మకంగా మారిన ఎల్లోవెస్ట్‌ ఆందోళనలు విదేశీ పెట్టుబడిదారులను సందిగ్దానికి గురి చేస్తున్నాయని, వారికి భరోసా కల్పించేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం .జరిగిందని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. గత 18 మాసాల్లో తీసుకువచ్చిన కార్మిక, పన్ను సంస్కరణల నుండి వెనక్కి మళ్ళేది లేదని మాక్రాన్‌ సిఇఓ అతిథులకు హామీ ఇచ్చారు. ప్రపంచీకరణ విధానాలపై మధ్య తరగతి ప్రజల ఆగ్రహం కారణంగానే ఈ ఎల్లోవెస్ట్‌ ఉద్యమం తలెత్తిందని అన్నారు.