స్కూళ్లలో పిల్లల డ్యాన్స్‌పై నిషేధం!

స్కూళ్లలో పిల్లల డ్యాన్స్‌పై నిషేధం!

  కరాచీ : పాఠశాల్లో విద్యార్థులు డ్యాన్స్‌ చేయడాన్ని పాకి‍స్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. పంజాబ్‌ ప్రావిన్స్‌ ప్రాంతాల్లోని ప్రైవేట్‌, ‍ప్రభుత్వ పాఠశాలన్నిటికి ఈ నిషేధం వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు డాన్‌ పత్రిక ప్రచురించింది. పాఠశాల్లో నిర్వహించే వార్షికోత్సవాలు, టీచర్స్‌డే, పేరెంట్స్‌డే కార్యక్రమాల్లో పిల్లలెవరూ నృత్య ప్రదర్శనలు చేయవద్దని పంజాబ్‌ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది.

స్కూళ్లలో డాన్సులు చేయడం మతవిలువలకు, సూత్రాలకు, సిద్ధాంతాలకు విరుద్ధమని, విద్యార్థుల చేత బలవంతంగా డాన్సులు చేయించడం లేదా అలాంటి అనైతిక కార్యక్రమాల్లో వారు పాల్గొనేలా చేసే స్కూళ్ల లైసెన్సులు రద్దు చేస్తామని ఓ సీనియర్‌ విద్యాశాఖ అధికారి పేర్కొన్నారు.  పాఠశాల్లో నిర్వహించే వేడుకల్లో విద్యార్థులు ఎక్కువగా బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌ చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అంతేగాకుండా ఈ పాటల డ్యాన్స్‌లు లైంగిక వేధింపులకు దారితీస్తున్నాయన్నారు. 

ఇక 2016లోనే స్కూళ్లలో డ్యాన్స్‌ నిషేధించాలని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ డిమాండ్‌ చేశారు. అయితే ఆ సమయంలో సింధు రాష్ట్ర సీఎం ఈ డిమాండ్‌ను వ్యతిరేకించారని డాన్‌ పత్రిక తెలిపింది.