సింగపూర్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు

సింగపూర్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు

 సింగపూర్: సింగపూర్ అధ్యక్ష పదవికి మొట్టమొదటిసారిగా ఓ మహిళ ఎంపికయ్యారు. మలయా మైనారిటీ వర్గానికి చెందిన మాజీ పార్లమెంట్ స్పీకర్ హలీమా యాకోబ్ దేశాధ్యక్ష పదవికి పోటీ లేకుండా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఆమె ప్రత్యర్థులకు తగిన అర్హత లేదంటూ అధికారులు హలీమా ఏకగ్రీవ ఎన్నికను ప్రకటించడం వివాదాస్పదమైంది. ఈసారి మలయా మైనారిటీలకు అధ్యక్ష పదవిని కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 

సర్కారు ఏకపక్షంగా తన నిర్ణయాన్ని రుద్దడం, బలవంతంగా ఏకగ్రీవం చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. హలీమా అధ్యక్షురాలిగా ఎన్నిక కాలేదు.. ఎంపికయ్యారు అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినవస్తున్నాయి. కొందరైతే అమెరికాలో ట్రంప్ ఎన్నికైనప్పుడు చేపట్టిన నిరసనల తరహాలో నాట్ మై ప్రెసిడెంట్ (నా అధ్యక్షురాలు కాదు) అనే ప్రచారం కూడా చేపట్టారు. పార్లమెంటరీ విధానం అమలులో ఉన్న సింగపూర్‌లో అధ్యక్ష పదవికి నామమాత్రపు అధికారాలు ఉంటాయి. దేశ పరిపాలనాధికారం ప్రధాని చేతుల్లోనే ఉంటుంది. ఈ నగరరాజ్యంలో దశాబ్దాలుగా ఏకపార్టీ పాలన కొనసాగుతున్నది. 55 లక్షల సింగపూర్ జనాభాలో చైనా సంతతివారే అధికంగా ఉంటారు.