శ్రీలంక పార్లమెంట్‌లో ఎంపీల మధ్య ఘర్షణ

శ్రీలంక పార్లమెంట్‌లో ఎంపీల మధ్య ఘర్షణ

  కొలంబో: శ్రీలంక పార్లమెంట్‌లో ఇవాళ ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రధాని రాణిల్ విక్రమసింఘే బాండ్ కమిషన్ రిపోర్ట్‌ను చదువుతున్న సమయంలో కొందరు ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. అరపులు, నినాదాలతో హోరెత్తించారు. అదే సమయంలో ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తున్నది. గందరగోళం మధ్య సభను స్పీకర్ పది నిమిషాలు వాయిదా వేశారు. బాండ్ కమిషన్ రిపోర్ట్‌ను చర్చించేందుకు ఇవాళ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. పార్లమెంట్‌లో ప్రధాని ప్రకటన చేస్తున్న సమయంలో 250 మంది ఎంపీలు ఉన్నారు. అయితే గొడవలో ఎంతమందికి గాయాలు అయ్యాయో స్పష్టంగా తెలియదు. కానీ కొందరు ఎంపీల షర్ట్‌లు చిరిగాయి. సెంట్రల్ బ్యాంక్ మాజీ గవర్నర్ అల్లుడు అవినీతికి పాల్పడ్డారని, దాంట్లో సుమారు 72 మిలియన్ల డాలర్ల మేరకు అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపై ఏర్పాటు చేసిన బాండ్ కమిషన్ రిపోర్ట్‌ను ఇవాళ సభలో వెల్లడించారు.