సిరియాపై అమెరికా పోరులో మరింత ప్రమాదకరమైన దశ

సిరియాపై అమెరికా పోరులో మరింత ప్రమాదకరమైన దశ

 డమాస్కస్‌ : ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే సిరియా ఈశాన్య ప్రాంత రాష్ట్రమైన డెర్‌ ఎజార్‌లో బుధవారం వంద మందికి పైగా సిరియా సైనికులను అమెరికా మట్టుబెట్టడం చూస్తుంటే గత మూడేళ్ళుగా సిరియాలో అమెరికా సైన్యం ప్రత్యక్ష జోక్యంలో మరింత ప్రమాదకరమైన దశ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇది యుద్ధ నేరమని సిరియా ప్రభుత్వం పేర్కొంటోంది. తీవ్రవాదానికి నేరుగా మద్దతివ్వడమేనని వ్యాఖ్యానించింది. యూఫ్రేరేట్స్‌ నదికి తూర్పు వైపున ఐసిస్‌ కార్యకర్తలపై తమ బలగాలు సైనిక చర్యలకు పాల్పడుతుంటే వారిపై అమెరికా దాడి జరిపి హతమార్చిందని సిరియా ప్రభుత్వం పేర్కొంది. వందమంది ప్రభుత్వ అనుకూల సైనికులను హతమార్చామని అమెరికా గర్వంగా ప్రకటించుకుంది. 

అయితే అమెరికా దాడుల్లో డజన్ల సంఖ్యలో సైనికులు మృతి చెందడమే కాకుండా, అనేకమంది గాయపడ్డారని, ఆ ప్రాంతంలో తీవ్ర నష్టం జరిగిందని సిరియా ప్రభుత్వం తెలిపింది. ఈ దాడులతో ఇరు పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2016 సెప్టెంబరు 17న డెర్‌ ఎజార్‌ విమానాశ్రయానికి సమీపంలో సిరియా ఆర్మీ స్థావరంపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 62మంది సైనికులు మరణించారు. వందమందికిపైగా గాయపడ్డారు. ఆ దాడి అనుకోకుండా జరిగిందని, పొరపాటు జరిగిందని అపుడే పెంటగన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈసారి మాత్రం ఆత్మ రక్షణ హక్కు పరిధిలో ఈ దాడి జరిగిందని అమెరికా చెబుతోంది. సిరియా ప్రభుత్వ అనుమతి గానీ, ఐక్యరాజ్య సమితి ఆదేశాలు గానీ లేకుండానే సిరియా ప్రభుత్వ భూభాగాన్ని ఆక్రమించి ఈ దాడి జరిపింది.