తాలిబన్లతో చర్చలు జరపాలనుకుంటున్న అమెరికా

తాలిబన్లతో చర్చలు జరపాలనుకుంటున్న అమెరికా

  వాషింగ్టన్‌ : తాలిబన్లతో చర్చలు జరపాలని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఆఫ్ఘనిస్తాన్‌లో సైనిక ఘర్షణలకు స్వస్తి పలకాలంటే సాధ్యమైనంత త్వరలో చర్చలు జరగాలని భావిస్తున్నట్లు అమెరికా దౌత్యాధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘన్‌లో పరిస్థితి చక్కబడకుండా తొందరపడి అక్కడ నుండి అమెరికన్‌ బలగాలను వెనక్కి పిలిపిస్తే అల్‌ఖైదా, ఐసిస్‌లు బలోపేతమయ్యే పరిస్థితి వుంటుందని పేర్కొంటూ పరిస్థితి మెరుగయ్యేవరకు తమ బలగాలు అక్కడే వుంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారు. 

ఆగస్టులో దక్షిణాసియా విధానాన్ని వెల్లడిస్తూ ట్రంప్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్‌లో వివిధ రకాలైన దౌత్యపరమైన చొరవలు కొనసాగుతున్నప్పటికీ ముఖాముఖి చర్చలు జరపాల్సిన అవసరం వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని దక్షిణాసియా, సెంట్రల్‌ ఆసియా వ్యవహారాలు చూసే సహాయ మంత్రి పేర్కొన్నారు. అయితే ఈ చర్చలు ఎప్పుడు జరిగేదీ ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ట్రంప్‌ చాలా బిజీగా వున్నారని, సాధ్యమైనంత త్వరలో చర్చలు జరపాలని భావిస్తున్నామని చెప్పారు.