థెరిసా మే ను గద్దెదింపేందుకు యత్నాలు

థెరిసా మే ను గద్దెదింపేందుకు యత్నాలు

  లండన్‌: బ్రెగ్జిట్‌ అనుకూలురైన దాదాపు 50 మంది టోరీ ఎంపిలు బుధవారం ఇక్కడ భేటీ అయి ప్రధాని థెరెస్సా మేను గద్దెదింపేందుకు అనుసరించాల్సిన విధానంపై మంతనాలు జరిపినట్లు బ్రిటన్‌ మీడియా వెల్లడించింది. ఈ భేటీకి హాజరైన వారిలో ఒకరు సమావేశంలో మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరూ ప్రధాని మే గద్దె దిగాలని కోరుకుంటున్నారు. ఆమె దేశానికి ఒక చీడలా పట్టారు. దీనిని వదిలించుకోవటం అంత సులభసాధ్యం కాదు' అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌ నాయకత్వానికి సవాలు విసిరే అంశంపై కూడా వీరు చర్చించినట్లు మీడియా తన కథనాలలో పేర్కొంది. ఈ నెల ఆరంభంలో మాజీ జూనియర్‌ బ్రెగ్జిట్‌ మంత్రి స్టీవ్‌బేకర్‌ ఒక సందర్భంలో మాట్లాడుతూ గద్దెదిగాలన్న డిమాండ్‌తో ప్రధాని మే పై వత్తిడి పెరుగుతన్నదని, దాదాపు 80 మంది టోరీ ఎంపిలు ఆమెకు వ్యతిరేకంగా ఓటు చేసే అవకాశం వుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. 

తద్వారా పార్టీలో చీలిక ఏర్పడే ప్రమాదం లేకపోలేదని ఆయన అన్నారు. బ్రెగ్జిట్‌ తరువాత బ్రిటన్‌- ఇయు మధ్య సంబంధాలను నిర్వచిస్తున్న ఈ ప్రణాళికపై ప్రజలు, రాజకీయ వేత్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బ్రెగ్జిట్‌పై ప్రధాని మే వ్యవహరిస్తున్న తీరును బ్రిటిష్‌ ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని జులై నుండి నిర్వహిస్తున్న వరుస ఒపీనియన్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. బ్రెగ్జిట్‌పై జరిగిన చర్చలు పాలక టోరీ పార్టీపై తీవ్ర ప్రభావాన్నే చూపాయి. ప్రభుత్వం నుండి మంత్రుల వరుస రాజీనామాలతో పాటు కన్జర్వేటివ్‌ ఎంపి ఫిలిప్‌ డేవిస్‌ థెరెస్సా నాయకత్వంపై అవిశ్వాసం ప్రకటిస్తూ లేఖ పంపిన విషయం తెలిసిందే.