ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన రద్దు

ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటన రద్దు

 వాషింగ్టన్‌ : లండన్‌లో కొత్త ఎంబసీని ప్రారంభించడానికి వచ్చే నెల్లో బ్రిటన్‌లో జరపాల్సిన పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజాందోళనలు తలెత్తుతాయనే భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో ఎంబసీకి సంబంధించిన తీసుకున్న నిర్ణయానికి నిరసనగా తానీ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ట్రంప్‌ ట్విట్టర్‌లో తెలిపారు. అయితే అమెరికా ఎంబసీని మార్చాలన్న ప్రతిపాదన 2008 అక్టోబరులోనే మొదటిసారిగా వచ్చింది. అప్పుడు జార్జి బుష్‌ అధ్యక్షుడుగా వున్నారు. కాగా, ట్రంప్‌ నిర్ణయంపై లండన్‌ మేయర్‌ సాదిక్‌ ఖాన్‌ స్పందిస్తూ, ట్రంప్‌ విధానాలను, చర్యలను, నిర్ణయాలను అనేకమంది లండన్‌వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్న సందేశం ట్రంప్‌కు అందిందని వ్యాఖ్యానించారు. 

వచ్చే నెల్లో ట్రంప్‌ పర్యటిస్తే ఖచ్చితంగా ప్రజల శాంతియుత నిరసనలను ఎదుర్కొనాల్సిందేనని, అందులో సందేహం లేదని మేయర్‌ స్పష్టం చేశారు. ఏడాది క్రితం ట్రంప్‌ను తమ దేశానికి రావాల్సిందిగా బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే ఆహ్వానించిన వెంటనే నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని కార్యకర్తలు ప్రతిన చేశారు. పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశాన్ని ఇవ్వబోమంటూ ఎంపీలు చెప్పారు. ట్రంప్‌ తాజా నిర్ణయంపై బ్రిటన్‌ ప్రభుత్వ ప్రతినిధిని వ్యాఖ్యానించమని కోరగా ట్రంప్‌ను ఆహ్వానించామని, ఆయన అంగీకరించారని, ఇంకా పర్యటన తేదీ ఖరారు కాలేదని పేర్కొంది. వైట్‌హౌస్‌ పత్రికా కార్యదర్శి సారా శాండర్స్‌ కూడా ఇదే రీతిలో స్పందించారు.